వేదికపై ఒక్కరే ఉండి బహిరంగ విచారణ నిర్వహిస్తున్న పీవీఆర్ రెడ్డి
విద్యుత్ పంపిణీ సంస్థల 2026–27 ఆదాయ, అవసరాల నివేదికలపై మొదలైన బహిరంగ విచారణ
ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలను రానివ్వకపోవడంపై మండిపడ్డ జనం
విద్యుత్ చార్జీలు భారీగా పెంచేశారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం
సాక్షి,అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) చరిత్రలో ఎన్నడూ ఇలా ఒకే ఒక సభ్యుడు వేదికపై ఉండి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం చూడలేదు. ప్రతిసారీ చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండి బహిరంగ విచారణ చేపట్టేవారు. ఈసారి ఒక్కరే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే.’’ అంటూ ప్రజలు, నాయకులు ఏకిపారేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమరి్పంచిన 2026–27 ఆదాయ, అవసరాల నివేదికలు,టారిఫ్ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ మంగళవారం తిరుపతిలో మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీఈఆర్‌సీ సభ్యుడైన పీవీఆర్ రెడ్డి, ఇన్‌చార్జ్ చైర్మన్ హోదాలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. వేదికపై ఆయన ఒక్కరే కూర్చుని సమస్యలను, సూచనలను వినడంపై అక్కడికి వచ్చిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గడిచిన 20 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని తాము చూడలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ను, సభ్యుడిని నియమించే తీరిక ఎందుకు లేదని వారంతా ప్రశ్నించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రజలను లోనికి అనుమతించకపోవడంతో ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ప్రజలను అనుమతించకుండా, అంతా అధికారులే ఉండి విచారణ జరపడం ఏమిటని వారు నిలదీశారు. దీంతో చైర్మన్(ఇన్‌చార్జి) కల్పించుకుని అందరినీ లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశించారు.
చార్జీలు పెంచేశారు.. ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వరు
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏపీఈఆర్‌సీ సాధించిన లక్ష్యాలను, ఇచ్చిన ఆదేశాలను చైర్మన్(ఇన్‌చార్జి) పీవీఆర్ రెడ్డి వివరించారు. ఆ వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యుత్ వినియోగదారుల నుంచి వినతులను స్వీకరించారు. పలువురు నేతలు పేదల గుడిసెలకు విద్యుత్ సర్విసులు మంజూరు చేయడం లేదని, మీటర్ల కోసం నిరీ్ణత రుసుమును కూడా కట్టించుకున్నారని ఫిర్యాదు చేశారు. అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టబోమని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు బలవంతంగా పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయ విద్యుత్ సర్విసు కోసం దరఖాస్తు చేస్తే నెలలు, సంవత్సరాలు కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వకపోవడం వల్ల పంటలు కోల్పోయి రూ.లక్షలు నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యుత్ చార్జీలు భారీగా పెంచేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.4495 కోట్ల భారం ప్రజలపై పడకుండా చేశామని, ఇప్పుడు వసూలు చేస్తున్న ట్రూ అప్ చార్జీలు త్వరలోనే పూర్తవుతాయని, భవిష్యత్తులో ఇక ఉండవని చైర్మన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడొస్తున్న చార్జీ గతంలో వాడిన దానిపై వేస్తున్నారని వివరించారు. అభిప్రాయసేకరణకు ముందు మూడు డిస్కంల ప్రగతి నివేదికలను సీఎండీలు పి.పుల్లారెడ్డి, ఐ.పృథ్వీతేజ్, శివశంకర్ లోతేటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
యూనిట్ రూ.2.49 ఎక్కువని రూ.4.60కి ఎలా కొంటారు?
గత ప్రభుత్వం సెకీతో యూనిట్ రూ.2.49 కి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే అది తప్పని సీఎం చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో మాట్లాడి యాక్సిస్ నుంచి రూ.4.60కి యూనిట్ చొప్పున కొనడానికి ఏవిధంగా ఒప్పందం చేసుకుంటారంటూ సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యుడు కందరాపు మురళి ప్రశ్నించారు. ట్రూ డౌన్ చేశామంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.17 వేల కోట్లు విద్యుత్ భారాలు ప్రజలపై వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టైమ్ ఆఫ్ డే విధానంలో మార్పుల వల్ల 12 శాతం విద్యుత్‌పై అధిక ధరలు పడతాయని, దానిని మరోసారి పరిశీలించాలని పారిశ్రామిక వేత్త కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. అసలు ఆదాయ లోటు ఎందుకు వస్తోందని, లోపం ఎక్కడుందని విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాలరావు ప్రశ్నించారు. అందరి అభిప్రాయాలనూ ఇన్‌చార్జ్ చైర్మన్ నమోదు చేసుకున్నారు.


