ఎత్తిపోతల పథకాలకు రియాక్టర్లు ఏర్పాటు చేయని ఫలితం
దీంతో రూ.లక్షల్లో రావాల్సిన ఎనర్జీ చార్జీలు రూ.కోట్లలో..
ఒక్క నంది పంప్‌హౌస్‌కే రూ.7.8 కోట్లకు బదులు రూ.152 కోట్ల ఎనర్జీ చార్జీలు
రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు మొత్తం 297 కనెక్షన్లు
2014–15 నుంచి ఎత్తిపోతలకు మొత్తం రూ.36,435 కోట్ల విద్యుత్ బిల్లులు
సాక్షి, హైదరాబాద్: లో పవర్ ఫ్యాక్టర్.. ఎత్తిపోతల పథకాల విద్యుత్ చార్జీలను ఠారెత్తిస్తోంది. ఉండాల్సిన దానికంటే తక్కువ పవర్ ఫ్యాక్టర్ కలిగి ఉండటంతో ఎత్తిపోతల పథకాలకు ప్రతి నెలా రూ.లక్షల్లో రావాల్సిన ఎనర్జీ చార్జీలు రూ.కోట్లలో వస్తున్నాయి. ఉదాహరణకు.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన నంది పంప్‌హౌస్ నిర్వహణకు గత నవంబర్‌లో 3.2 లక్షల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఎనర్జీ చార్జీలు యూనిట్‌కి రూ.6.3 పైసలు కావడంతో 3.2 లక్షల యూనిట్ల వినియోగానికి రూ.20.16 లక్షల ఎనర్జీ చార్జీలు మాత్రమే రావాలి.
కానీ, ఏకంగా రూ.3.84 కోట్లు వచ్చింది. నిబంధనల ప్రకారం పవర్ ఫ్యాక్టర్ 1 (యూనిటీ) ఉండాల్సి ఉండగా, నవంబర్‌లో నంది పంప్‌హౌస్ నామమాత్రంగా 0.04 పవర్ ఫ్యాక్టర్ కలిగి ఉండడంతో 3.2 లక్షల యూనిట్లు వాడినా.. 61 లక్షల యూనిట్లు వాడినట్టు లెక్కించి రూ.3.84 కోట్ల ఎనర్జీ చార్జీలను ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) విధించింది. పవర్ ఫ్యాక్టర్ ఉండాల్సిన దాని కంటే తగ్గిపోతే గ్రిడ్ నిర్వహణలో సమస్యలు తలెత్తడంతోపాటు పెద్ద మొత్తంలో విద్యుత్ నష్టాలు వస్తాయి. వోల్టేజీ నిర్వహణలో సైతం సమస్యలు తప్పవు. పవర్ ఫ్యాక్టర్ స్థిరీకరణ కోసం రియాక్టర్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
రూ.7.8 కోట్ల బదులు 152 కోట్లు
నంది పంప్‌హౌస్ వద్ద 12 ఎంవీఏఆర్ సామర్థ్యం గల రియాక్టర్‌ను ఏర్పాటు చేసి ఉంటే నవంబర్‌లో రూ.3.63 కోట్ల ఎనర్జీ చార్జీలు ఆదా అయ్యేవి. 2018 సెపె్టంబర్ నుంచి 2025 నవంబర్ వరకు నంది పంప్‌హౌస్ నిర్వహణకు 1.23 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వాస్తవంగా వాడినా, సగటున 0.04 పవర్ ఫ్యాక్టర్ మాత్రమే కలిగి ఉండటంతో 24.21 కోట్ల యూనిట్ల వినియోగానికి సంబంధించిన ఎనర్జీ చార్జీలను టీజీఎన్పీడీసీఎల్ విధించింది. అంటే, ఇప్పటివరకు మొత్తం రూ.7.8 కోట్ల ఎనర్జీ చార్జీలు మాత్రమే రావాల్సి ఉండగా, ఏకంగా రూ.152.53 కోట్ల ఎనర్జీ చార్జీలను విధించింది.
కాళేశ్వరం, దేవాదుల, ఇతర ఎత్తిపోతల పథకాలకి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 297 విద్యుత్ కనెక్షన్లుండగా, 2014–15 నుంచి గత నవంబర్ వరకు మొత్తం రూ.36,435 కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చాయి. దేవాదుల, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి వంటి కీలక ఎత్తిపోతల పథకాలు ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోయినా విద్యుత్ బిల్లులు ఇలా భారీగా పెరగడానికి లోపవర్ ఫ్యాక్టర్ కూడా ఒక కారణమని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
సమన్వయ లోపం...
ఎత్తిపోతల పథకాలను నీటిపారుదల శాఖ నిర్మించినా వాటికి సంబంధించిన సబ్ స్టేషన్ల నిర్వహణను ట్రాన్స్‌కోకు అప్పగించారు. ఎత్తిపోతల పథకాలకు ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 13 కనెక్షన్లు, దేవాదులకు 13 కనెక్షన్లతోపాటు ఇతర ఎత్తిపోతల పథకాలకి సంబంధించి 171 కనెక్షన్లు కలిపి మొత్తం 297 విద్యుత్ కనెక్షన్లుండగా, వాటికి సంబంధించిన పవర్ ఫ్యాక్టర్ స్థిరీకరణ కోసం రియాక్టర్లు ఏర్పాటు చేయలేదు.
దీంతో ఏటా రూ.వందల కోట్ల ఎనర్జీ చార్జీలను ప్రభుత్వం డిస్కంలకు అనవసరంగా చెల్లించాల్సి వస్తోంది. సామర్థ్యం ఆధారంగా రూ.రెండు మూడుకోట్లు మాత్రమే వ్యయం చేసే రియాక్టర్లను ఏర్పాటు చేసుకుంటే ఈ అనవసర ఎనర్జీ చార్జీల నుంచి సర్కారుకు ఉపశమనం లభించేది. నీటిపారుదల శాఖ అధికారులకు అవగాహన లేకపోవడంతోపాటు ట్రాన్స్‌కో, డిస్కంలతో సరైన సమన్వయం లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తినట్టు విమర్శలు వస్తున్నాయి.
ఎనర్జీ చార్జీలు ఏమిటి?
విద్యుత్ బిల్లుల్లో ఎనర్జీ చార్జీలు, డిమాండ్ చార్జీలు (ఫిక్స్‌డ్ చార్జీలు)తోపాటు ఇతర చార్జీలు, విద్యుత్ సుంకం కలిపి అయ్యే మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఇందులో ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడితే అంత మేరకు ఎనర్జీ చార్జీలను విధిస్తారు. ఇక కాంట్రాక్టెడ్ మ్యాగ్జిమ్ డిమాండ్ ఆధారంగా ప్రతి నెలా స్థిరమైన చార్జీలను ఫిక్స్‌డ్ చార్జీలుగా డిస్కంలు విధిస్తాయి.


