విద్యుత్‌ వినియోగదారులకు భారీ ఊరట

Huge relief for electricity consumers in Andhra Pradesh - Sakshi

వసూలు చేసిన ఇంధన సర్దుబాటు చార్జీలను వెనక్కిస్తున్న డిస్కంలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూఅప్‌) కింద వసూలు చేసిన సొమ్మును విద్యుత్‌ పంపిణీ సంస్థలు వినియోగదారులకు తిరిగిచ్చేస్తున్నాయి. డిసెంబర్‌ నెల (నవంబర్‌లో వినియోగానికి సంబంధించి) బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు తగ్గాయి. ట్రూఅప్‌ చార్జీల కింద వసులు చేసిన మొత్తాన్ని విద్యుత్‌ బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా విద్యుత్‌ బిల్లులను పరిశీలించిన వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీఈఆర్‌సీ ఆదేశాలతో వెనక్కి..
2014–15 నుంచి 2018–19 కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌), ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూఅప్‌ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) గత ఆగష్టు 27న రూ.3,669 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతినిచ్చింది. ఏపీఎస్పీడీసీఎల్‌ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్‌ రూ.609 కోట్ల మేర ట్రూఅప్‌ చార్జీలను ఎనిమిది నెలల్లో వసూలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్‌ బిల్లులలో ఆ మేరకు చార్జీలు విధించాయి. అయితే పలు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్‌సీ తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీంతో విద్యుత్‌ బిల్లులు ట్రూఅప్‌ చార్జీలు లేకుండానే వినియోగదారులకు అందుతున్నాయి. వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన ట్రూఅప్‌ చార్జీలను బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు.

వినియోగదారులకు రూ.196.28 కోట్లు
ట్రూఅప్‌ చార్జీలను ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో యూనిట్‌కు రూ.0.45 పైసలు ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో రూ.1.27 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఇలా ఏపీఈపీడీసీఎల్‌ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్‌ రూ.70 కోట్లు చొప్పున ట్రూఅప్‌ కింద వసూలు చేశాయి. ఐదేళ్ల క్రితం నాటి ట్రూఅప్‌ చార్జీలు కావడంతో అప్పటికి ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఉన్న సర్వీసులు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ మధ్యప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌) పరిధిలోకి  వచ్చాయి. వీటికి ఏపీసీపీడీసీఎల్‌ బాధ్యత తీసుకుని రూ.28 లక్షలు వసూలు చేసింది. ఈ క్రమంలో మొత్తం రూ.196.28 కోట్లను వినియోగదారులకు డిస్కంలు వెనక్కి ఇస్తూ విద్యుత్‌ బిల్లుల్లో సర్దుబాటు చేస్తున్నాయి. ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో నవంబర్‌ నెల బిల్లుల నుంచే ట్రూఅప్‌ చార్జీలను వినియోగదారులకు తిరిగి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం కాగా ఏపీఈపీడీసీఎల్‌ డిసెంబర్‌ నుంచి చేపట్టింది. ఫలితంగా రాష్ట్రంలో 1.86 కోట్ల మంది వినియోగదారులకు ఊరట దక్కింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top