
పవర్ షాక్
గ్రేటర్ సిటీజనులు ఇకపై మరింత పొదుపుగా విద్యుత్ వాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే భారీగా బిల్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఏడాదికి రూ.495 కోట్లు
మధ్య తరగతిపై విద్యుత్ భారం
వంద యూనిట్ల లోపు పాత ఛార్జీలే
20 లక్షల మందిపై భారం
సిటీబ్యూరో: గ్రేటర్ సిటీజనులు ఇకపై మరింత పొదుపుగా విద్యుత్ వాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే భారీగా బిల్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ బిల్లులు పెంచడం ద్వారా నగర వాసులకు సర్కారు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల మహా నగరంలోని 20 లక్షల మంది వినియోగదారులపై విద్యుత్ బిల్లుల రూపంలో ఏడాదికి రూ.495 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే నిత్యవసరాలు, ఇతరత్రా పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులు ఈ దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది.
2015-16 సంవత్సరానికి విద్యుత్తు పంపిణీ సంస్థ సమర్పించిన కొత్త చార్జీల ప్రతిపాదనల ప్రకారం.. వివిధ కేటగిరీల్లో 4 నుంచి 5.75 శాతం వరకు పెరిగాయి. ఒక్కో యూనిట్‌పై కనిష్ఠంగా 10 పైసల నుంచి 48 పైసల వరకు పెంచుతూ ప్రతిపాదించారు. కొత్త టారిఫ్ ప్రకారం వంద యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు పాత చార్జీలే వర్తిస్తాయి. 101-200 యూనిట్ల మధ్య వినియోగించే గృహాలకు నాలుగు శాతం చార్జీలు పెరుగుతాయి. మిగిలిన అన్ని కేటగిరీలకూ 5.75 శాతం వడ్డించారు. పరిశ్రమల కేటగిరిలో చార్జీలు 4.75 శాతం పెరగనున్నాయి.
200 యూనిట్లు దాటితే బాదుడే...
200 యూనిట్లు దాటితే శ్లాబ్ పద్ధతిలో రేట్లు వర్తిస్తాయి. దీంతో వినియోగదారులపై భారీగానే భారం పడనుంది. 200 యూనిట్లు వినియోగించే మధ్య తరగతి గృహాల కరెంటు బిల్లు రూ.600 నుంచి రూ.625కు పెరగనుంది. ఆ పైన ఒక్క యూనిట్ విద్యుత్ అదనంగా వాడినా అమాంతం రూ.872.75కు చేరనుంది.
గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ కనెక్షన్ల వివరాలు
గృహ విద్యుత్ కనెక్షన్లు : 30.90 లక్షలు
వాణి జ్య : 5.50 లక్షలు
చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు : 40 వేలు
ప్రకటనలు, వీధి దీపాలు : 40 వేలకు పైనే