భవిష్యత్తు ‘వెలుగు’లకు భరోసా

Electricity Distribution Company In AP Agreement With SembCorp Energy India - Sakshi

625 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చుకున్న డిస్కంలు

‘సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ ఇండియా’తో  ఒప్పందం

12 ఏళ్ల పాటు పంపిణీ సంస్థలకు థర్మల్‌ విద్యుత్‌

నెల్లూరులోని 2.6 గిగావాట్ల ప్లాంటు నుంచి కేటాయింపు

బొగ్గు కొరత, బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు ధరల పెరుగుదల నేపథ్యంలో ముందుచూపుతో నిర్ణయం

సాక్షి, అమరావతి: సెంబ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ ఇండియాతో రాష్ట్రంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు దీర్ఘకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) కుదుర్చుకున్నాయి. 12 ఏళ్ల పాటు డిస్కంలకు ఈ సంస్థ 625 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయనుంది. వచ్చే ఏడాది (2023) నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్‌ వనరుల నుంచి 8,075 మెగావాట్లు వస్తోంది. 

కానీ వీటి నుంచి విద్యుత్‌ ఉత్పత్తి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీంతో ఏడాదిలో ఎక్కువ రోజులు పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి జరగటం లేదు. రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ కెపాసిటీ 5,010 మెగావాట్లుగా ఉంది. ఈ థర్మల్‌ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును సమకూర్చేందుకు మహానది కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్, సింగరేణి సంస్థలతోపాటు విదేశాల నుంచి దిగుమతులే ఆధారం. ఇలా సమకూర్చుకున్న బొగ్గు మన థర్మల్‌ ప్లాంట్ల మొత్తం అవసరాలలో 70 నుంచి 75 శాతం తీర్చగలుగుతాయి. జెన్‌కో బొగ్గు ప్లాంట్లకి రోజుకు దాదాపు 70 వేల టన్నుల బొగ్గు అవసరం. గతేడాది దేశంలో బొగ్గు సంక్షోభం తీవ్రంగా వేధించింది. గత ఏడాది సెప్టెంబర్‌ ఆఖరులో రోజుకు 24 వేల టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందంటే ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. 

భవిష్యత్‌ అవసరాల కోసం
బొగ్గు కొరత సమయంలో రాష్ట్రంలో థర్మల్‌ ప్లాంట్లు నడపడం దాదాపు అసాధ్యమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్‌ నుంచి అధిక ధరలు చెల్లించైనా సరే విద్యుత్‌ కొనుగోలు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్‌ సంస్థలకు సూచించారు. అప్పుడు మార్కెట్‌లో యూనిట్‌కు రూ.20 వెచ్చించి విద్యుత్‌ కొన్నారు. సాధారణ రోజుల్లో ఈ రేటు రూ.6 వరకు ఉంటుంది. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాదని చెప్పలేం. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాలను, రాబోయే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెంబ్‌కార్ప్‌తో ఒప్పందం చేసుకున్నారు.

యూనిట్‌ ధర రూ.3.84 
నెల్లూరులో సెంబ్‌కార్ప్‌ ఎనర్జీకి 2.6 గిగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఈ థర్మల్‌ ప్లాంట్‌ సామర్థ్యంలో 77 శాతం విద్యుత్‌ను దీర్ఘకాలిక, మధ్యకాలిక పీపీఏల ద్వారా డిస్కంలకు ఇస్తోంది. మనకు యూనిట్‌ రూ.3.84కు ఇవ్వనుంది. 
– నాగులపల్లి శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి

ఏపీఅభివృద్ధిలో భాగమవుతున్నందుకు సంతోషం
పునరుత్పాదక శక్తిలో సెంబ్‌కార్ప్‌ తన ఉనికిని వేగంగా పెంచుకుంటోంది. మేం ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సరైన రీతిలో ఉపయోగించుకోవడానికి ఏపీ డిస్కంలతో జరిగిన దీర్ఘకాలిక ఒప్పందం దోహదపడుతుందని భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
– విపుల్‌ తులి, సెంబ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ దక్షిణాసియా విభాగం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top