ప్రకాశం జిల్లా: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల మధ్య గలాటా జరగటంతో బస్సు డ్రైవర్ మహిళలను పోలీస్‌స్టేషన్ సమీపంలో దింపి వెళ్లిపోగా ఎస్సై మహిళల మధ్య సర్దుబాటు చేసి వేరే బస్సుల్లో పంపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి సింగరాయకొండలో జరిగింది.
స్థానికుల కథనం మేరకు కావలి, రామాయపట్నం ప్రాంతాలకు చెందిన మహిళలు సింగరాయకొండ లోని బంధువుల ఇళ్లకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఒంగోలు–కావలి బస్సులో వెళుతుండగా సీటు విషయమై మహిళల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఒక మహిళ అసభ్యంగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో సుమారు 10 మంది వరకు మహిళలను దింపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ విషయం తెలుసుకున్న ఎస్సై బి.మహేంద్ర హుటాహుటిన మహిళల వద్దకు వచ్చి వారిని శాంతపరచి వీరిని వేర్వేరు బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, ఉచిత బస్సుల వల్లే ఈ ఘటనలు ఎక్కువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.


