సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఇంటి వద్ద ఓ వృద్ధుడి ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం రేపింది. న్యాయం చేస్తామని చెప్పి ఏడాది గడిచినా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని.. పైగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వాపోతూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నాగి రాజయ్య గారిపల్లికి చెందిన గోవిందరెడ్డి(65) తనకున్న భూసమస్యపై సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం ఉదయం నారావారిపల్లికి వచ్చాడు. అయితే.. సీఎం పండుగ వేడుకల్లో బిజీగా ఉన్నారని చెబుతూ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రుయాకు తరలించారు.
ఏడాది గడిచినా..
గోవిందరెడ్డికి తన అన్నదమ్ములతో భూ పంచాయితీ నడుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే లక్షలు ఖర్చు చేశాడు. అయితే.. గత ఏడాది జనవరిలో మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబును నారావారిపల్లెలోనే కలిసి న్యాయం చేయమని బతిమాలాడాడు. ఆ సమయంలో.. తాము చూసుకుంటామంటూ తండ్రీకొడుకులు మాట ఇచ్చారు. అయితే ఏడాది అవుతున్నా ఇంతవరకు న్యాయం జరగలేదు.

గోవిందరెడ్డితో వచ్చిన రెడ్డప్ప అనే వ్యక్తి మాట్లాడుతూ.. నేను బైక్ పార్కింగ్ చేస్తుండగా ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోవిందరెడ్డి వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. కలెక్టర్, ఎమ్మార్వోలను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు పంచాయితీల పేరుతో లక్షలు నష్టపోయాడు. డబ్బులు ఖర్చు చేసినా న్యాయం జరగలేదు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. న్యాయం కోసం గత ఏడాది నారావారిపల్లెలో మంత్రి లోకేష్‌ను కలిశాం. న్యాయం కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గోవిందరెడ్డికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.


