పంచాయతీ ఫలితాలపై కాంగ్రెస్‌లో హర్షం
గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పటిష్టంగా ఉందని రుజువైందనే అభిప్రాయం
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతోనే ఇది సాధ్యమైందంటున్న పార్టీ వర్గాలు
సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ పథకాలే కారణమని విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడంపై అధికార కాంగ్రెస్ పార్టీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. దాదాపు 7 వేల వరకు సర్పంచ్ స్థానాలు, మెజార్టీ వార్డు స్థానాల్లో గెలు పొందడంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తు న్నాయి.
ఈ ఫలితాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని రుజువైందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై పల్లె ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనమని అంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇమేజ్‌కు తోడు మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం మంచి ఫలితాలను సాధించి పెట్టిందని అంచనా వేస్తున్నాయి.
సంక్షేమమే బాసటగా..!
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయానికి రాష్ట్రంలో సంక్షేమ పథకాలే బాసటగా నిలిచాయనే అభిప్రాయం గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పేదలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలు గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి కారణమయ్యాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఒకట్రెండు జిల్లాలు మినహా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలన్నింటా పార్టీ ఆధిక్యం సాధించడం చూస్తే సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు పల్లె ప్రజలు పట్టం కట్టిన విషయం స్పష్టమవుతోందని, పార్టీ పట్ల వ్యతిరేకత లేదని కూడా తేలిపోయిందని అంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టు పెంచుకున్నామని, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు ద్వారా పల్లె ప్రాంతాల్లో గట్టిగా పాగా వేయగలిగామని, బీఆర్‌ఎస్–బీజేపీలు కలిసినా ఆ రెండు పార్టీలకు కలిపి 30 శాతం సీట్లు రాకపోవడం ప్రతిపక్షాలపై ప్రజలకు నమ్మకం లేదని చెప్పడానికి నిదర్శనమని అంటున్నారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు గ్రామీణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుండడం, ఓవైపు బీఆర్‌ఎస్ చేసిన అప్పులు తీరుస్తూ మరోవైపు అభివృద్ధి ఆగకుండా మంత్రివర్గం పని చేస్తుండడం, తెలంగాణను ప్రపంచ యవనికపై నిలబెట్టేందుకు సీఎం రేవంత్ చేస్తున్న కృషి లాంటివన్నీ కలిసి పంచాయతీల్లో కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు కట్టబెట్టాయి..’ అని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
75 శాతం మా వాళ్లే..
ఏ పార్టీ బలపర్చకుండా స్వతంత్రంగా గెలిచిన వారిలో 90 శాతం మంది తమ పార్టీ వారేనని కాంగ్రెస్ అంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,200 గ్రామాల్లో తమ పార్టీ రెబెల్స్ బరిలో ఉన్నారని, పార్టీలో పనిచేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోటీకి ఇది నిదర్శనంగా నిలుస్తుందని చెబుతోంది. ఇప్పుడు గెలిచిన స్వతంత్రులు ఎక్కువ మంది కాంగ్రెస్ గూటికే చేరుతారని, తద్వారా రాష్ట్రంలోని 75 శాతం పంచాయతీలు తమ పక్షమే అవుతాయని విశ్లేషిస్తోంది.


