బీజేపీ పట్టణ ప్రాంతాలకే పరిమితం కాదని స్పష్టమైంది..
పల్లె పోరులో సాధించిన ఫలితాలే నిదర్శనం
పంచాయతీ ఎన్నికలపై కమలం పార్టీ విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా సంతృప్తి కలిగించే ఫలితాలు రాకపోయినా ఒక మోస్తరు మంచి ఫలితాలనే సాధించామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొంతకాలంగా బీజేపీ పట్ట ణప్రాంతాలకే పరిమితమైన పార్టీ అనే విమర్శ ఉన్నా...దానిని ఈ ఎన్నికల్లో సాధించిన ఫలితాల ద్వారా తప్పు అని నిరూపించగలిగామని అంటున్నారు. బుధవారం జరిగిన మూడోవిడత ఎన్నికల ఫలితాలతో కలిపి మొత్తంగా 700 దాకా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినట్టుగా వారు అంచనా వేస్తున్నారు.
మొదటి విడత కంటే కూడా రెండు, మూడు విడతల్లో మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో గణనీయమైన స్థానాలు సాధించామని, ఇతర జిల్లాల్లోనూ కనీస ప్రాతినిధ్యం దక్కడంతో మొత్తంగా గ్రామీణ పాంతాల్లో గట్టి ఉనికిని ప్రదర్శించినట్టయ్యిందని చెబుతున్నారు.
900 మంది వరకు మా వాళ్లే: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
మూడు విడతల్లో కలిపి మొత్తంగా 800 నుంచి 900 వరకు (ఇండిపెండెంట్లు కలుపుకొని) సర్పంచ్ స్థానాల్లో తమ పార్టీ బలపరిచినవారు విజయం సాధించి ఉంటారని భావిస్తున్నట్టు బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఫలితాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోకి బీజేపీ బలంగా చొచ్చుకు వెళ్లిందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ విధంగా క్షేత్రస్థాయిలో పెరిగిన పార్టీ బలం త్వరలోనే రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల్లో మరిన్ని మంచి ఫలితాల సాధనకు దోహదపడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.
పెద్దసంఖ్యలో వార్డుసభ్య స్థానాలను, ఉప సర్పంచ్‌లను సైతం గెలుచుకోవడం సంతృప్తిని కలిగించిందన్నారు. మొత్తంగా పార్టీకి బలంగా ఉన్న ప్రాంతాలు..ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు ఇతర జిల్లాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయన్నారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో 163 మంది సర్పంచ్‌లకే బీజేపీ పరిమితం కావడాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం దాదాపు 12 వేల గ్రామ పంచాయతీలల్లో ఎన్నికలు జరిగితే 6 నుంచి 7 వేల గ్రామాల్లోనే అభ్యర్థులను నిలపాగలిగామని రాంచందర్‌రావు తెలిపారు. భద్రాచలం, మహబూబాబాద్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామటుకు పోటీకి నిలబెట్టలేకపోయామని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల బీజేపీకి పట్టున్న అనేక గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో అక్కడ ఎన్నికలు జరగలేదన్నారు.


