జౌన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు మతాంతర వివాహం చేసుకోగా, ఆ కోపంతో తల్లిదండ్రులు అతనిని, అతని భార్యను ఇంటిలోనికి రానివ్వలేదు. దీంతో ఆ కుమారుడు తల్లిదండ్రుల ప్రాణాలను తీయడమే కాకుండా, వారి మృతదేహాలను రంపంతో ముక్కలుగా నరికి నదిలో పారవేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను పదవీ విరమణ పొందిన రైల్వే ఉద్యోగి శ్యామ్ బహదూర్ (62), అతని భార్య బబితా (60)లుగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం నిందితుడు అంబేష్ ఐదేళ్ల క్రితం ఒక ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహం ఇష్టం లేని తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఈ క్రమంలో ఆ యువ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. భార్యకు భరణం కింద రూ. 5 లక్షలు చెల్లించేందుకు అంబేష్ తన తండ్రిని డబ్బు అడగగా, అందుకు ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన అంబేష్ బరువైన రుబ్బు రాయితో తల్లి తలపై కొట్టి చంపాడు. అడ్డువచ్చిన తండ్రిని కూడా అదే రీతిలో కొట్టి హతమార్చాడు.
హత్య అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు అంబేష్ అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. మృతదేహాలను తరలించేందుకు పెద్ద సంచులు దొరక్కపోవడంతో, గ్యారేజీలో ఉన్న రంపంతో తల్లిదండ్రుల శరీరాలను ఆరు ముక్కలుగా నరికాడు. ఆపై వాటిని చిన్న సంచుల్లో నింపి, తన కారు డిక్కీలో వేసుకుని, సమీపంలోని నదిలో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, తన తల్లిదండ్రులు గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయారని, వారిని వెతకడానికి తాను వెళ్తున్నానని సోదరికి ఫోన్ చేసి చెప్పి, తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు.
అయితే వారం రోజులుగా అంబేష్ ఆచూకీ లేకపోవడంతో అనుమానం వచ్చిన అతని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అంబేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అతడు చేసిన ఘోరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు నదిలో గాలింపు చేపట్టిన పోలీసులకు తండ్రి శరీరంలోని ఒక భాగం లభ్యమైంది. హత్యకు వాడిన రంపం, రుబ్బురాయిని స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన శరీర భాగాల కోసం గజ ఈతగాళ్ల చేత గాలిస్తున్నామని అదనపు ఎస్పీ ఆయుష్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: పాక్ మరో దుశ్చర్య.. 40 ఏళ్ల ఆఫ్ఘన్ శిబిరాల మూసివేత


