సమాధానం ఇచ్చేందుకు గడువు కోరిన కడియం
దానం నాగేందర్ గడువు కోరడంపై ఊహాగానాలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఇచ్చిన నోటీసుల గడువు ఆదివారం ముగిసింది. అయితే స్పీకర్ విధించిన గడువులోగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ సమాధానం ఇవ్వలేదు. అయితే నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు తనకు కొంత వ్యవధి కావాలని ఈ నెల 21న స్పీకర్‌ను కడియం శ్రీహరి వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశారు.
అయితే ఆయన చేసిన విజ్ఞప్తిపై స్పీకర్ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా స్పీకర్‌ను ఫోన్ ద్వారా గడువు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం ఉదయం మంత్రుల నివాస సముదాయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో నాగేందర్ భేటీ అయ్యారు. స్పీకర్ జారీ చేసిన నోటీసులకు స్పందించాల్సిన తీరుపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇచి్చన నోటీసుల గడువు ముగియడంతో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.


