2024–25లో వచ్చిన పెట్టుబడుల్లో మూడో వంతు వాటా
రిజర్వ్ బ్యాంక్ సర్వేలో వెల్లడి
ముంబై: గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) మూడో వంతు వాటాతో అమెరికా, సింగపూర్ అగ్రస్థానంలో నిల్చాయి. మొత్తం రూ. 68,75,931 కోట్ల ఎఫ్‌డీఐలు రాగా అమెరికా వాటా 20 శాతంగా, సింగపూర్‌ది 14.3 శాతంగా ఉంది. మారిషస్ (13.3 శాతం), బ్రిటన్ (11.2 శాతం), నెదర్లాండ్స్ (9 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఫారిన్ లయబిలిటీస్, అసెట్స్ (ఎఫ్‌ఎల్‌ఏ)పై రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన వార్షిక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 45,702 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో 41,517 సంస్థలు తమ బ్యాలెన్స్ షీట్స్‌లో ప్రస్తావించాయి.
ఇందులో నాలుగింట మూడొంతుల సంస్థలు విదేశీ కంపెనీల అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. మార్కెట్ వేల్యూ ప్రకారం మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీ పెట్టుబడుల్లో తయారీ రంగం అత్యధిక వాటా దక్కించుకోగా, సర్వీసుల రంగం రెండో స్థానంలో నిల్చింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐల పరిమాణం రూ. 61,88,243 కోట్లుగా నమోదైంది. మరోవైపు, తాజాగా గత ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో చేసిన ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం రూ. 11,66,790 కోట్లుగా నమోదైంది. ఇందులో సింగపూర్ వాటా 22.2 శాతంగా, అమెరికా వాటా 15.4 శాతంగా ఉంది. బ్రిటన్ (12.8 శాతం), నెదర్లాండ్స్ (9.6 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.


