సొరంగం పూర్తిచేసేందుకు అత్యాధునిక విధానం... టైగర్ రిజర్వ్‌కు ఇబ్బందుల్లేకుండా నియంత్రిత బ్లాస్టింగ్
రెండేళ్లలో పూర్తిచేసేలా పకడ్బందీ కార్యాచరణ
కొనసాగుతున్న హెలీబోర్న్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే... 20 రోజుల్లో 3డీ మ్యాప్ రూపంలో ప్రభుత్వానికి నివేదిక
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధి కావడంతో పర్యావరణం, జీవావరణానికి హాని కలగకుండా అత్యంత అధునాతన సాంకేతిక పద్ధతుల్లో పనుల పూర్తికి చర్యలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగా ఇటీవలే హెలిబోర్న్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ జియో ఫిజికల్ సర్వే నిర్వహించింది. మరో ఐదు రోజుల్లో ఈ సర్వే పూర్తి కానుండగా.. 20 రోజుల్లో నివేదికను త్రీడీ మ్యాప్ రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఎన్‌జీఆర్‌ఐ ప్రతినిధులు తెలిపారు. దీని ఆధారంగా రెండేళ్లలో మిగిలిన సొరంగం పనులు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మొత్తం 43.39 కి.మీ... మిగిలింది 9.8 కి.మీ.,
ఫ్లోరైడ్ పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సుమారు 30 లక్షల మందికి తాగు, మూడు లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీని 1983లో ప్రతిపాదించారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. నల్లమలలోని ఏటీఆర్ పరిధిలో సుమారు రూ.4,600 కోట్ల వ్యయంతో భూగర్భంలో 43.93 కిలోమీటర్ల మేర సొరంగం (టన్నెల్) నిర్మాణ పనులను టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) పద్ధతిన చేపట్టారు.
భూ పొరల్లో వచ్చిన మార్పులతో ఈ ఏడాది ఫిబ్రవరిలో దోమలపెంట వద్ద టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటివరకు దోమలపెంట ఇన్‌టెక్ నుంచి 13.94 కి.మీ., మన్నెవారిపల్లి ఔట్‌లెట్ నుంచి 20.4 కి.మీ. టన్నెల్ పనులు పూర్తికాగా.. ఇంకా 9.8 కి.మీ. మేర చేపట్టాల్సి ఉంది.
దోమలపెంట వద్ద ప్రమాదం అనంతరం టీబీఎం పద్ధతిలో పనులు శ్రేయస్కరం కాదని, డీబీఎం (డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతి) విధానంతో చేయొచ్చని నిపుణులు సూచించారు. దీంతో ప్రభుత్వం బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ)కు చెందిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో మిగిలిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేసేలా.. ఆయనను డిప్యుటేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీగా నియమించింది.
‘న్యూ ఆ్రస్టేయిన్’పద్ధతిలో..
టన్నెల్ పూర్తికి అధునాతన న్యూ ఆ్రస్టేయిన్ టన్నెలింగ్ మెథ డ్‌ను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. నియంత్రిత డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానం ద్వారా కేవలం నాలుగు మీటర్ల డయాలో పేలుళ్ల తరంగాలు (వేవ్స్) వచ్చేలా సొరంగం తవ్వకాలు చేపట్టవచ్చు. లేదంటే టన్నెల్ ప్రస్తుత చుట్టు కొలత 9.2 మీటర్లు కాగా.. డీబీఎం విధానంలో గుర్రపు డెక్క ఆకారంలో 10 మీటర్ల డయాలో బ్లాస్టింగ్ చేపట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఈ విధానం వల్ల సుమారు 400 నుంచి 500 మీటర్ల పైన ఉన్న భుభాగంపై అటవీ ప్రాంతానికి, జంతు జాలానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. డీబీఎం విధానంలో చేపడితే వ్యర్థాల తరలింపు సమస్యగా మారనున్నట్లు తెలుస్తోంది.
సర్వే ఆధారంగానే..
ఎలక్ట్రో మ్యాగ్నటిక్ జియోఫిజికల్ సర్వేలో టన్నెల్ పరి ధిలోని 44 కి.మీ పొడవు, 500 నుంచి 800 మీటర్ల లోతు వరకు మ్యాపింగ్ చేస్తారు. షీర్ జోన్లు, జల వనరులు, సునిశిత ప్రదేశాలు ఉన్నా.. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా మార్గం మార్చి టన్నెల్ పూర్తి చేయవచ్చు. ఏదైనా సర్వే ఆధారంగా భూ భౌతిక పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే అలైన్‌మెంట్, తవ్వకాల పనులపై స్పష్టత వస్తుంది. – పరీక్షిత్ మెహ్రా, బీఆర్‌ఓ కల్నల్


