‘సిట్’తో దర్యాప్తు చేయించాలి
అడ్డాకుల: మూసాపేట మండలం వేముల గ్రామంలో లైంగికదాడికి గురై మృతి చెందిన దళిత యవతి కుటుంబాన్ని ఆదివారం రాత్రి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. మృతురాలి చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అత్యాచారం జరిగిన ఘటన గురించి కుటుంబసభ్యులు, గ్రామస్తులతో ఆరా తీశారు. ఘటన తర్వాత జరిగిన పరిణామాలను తెలుసుకుని కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు. అనంతరం ఘటన జరిగిన రైతు వేదిక వద్దకు వెళ్లి పరిశీలించారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు. అత్యాచార ఘటనపై ప్రభుత్వం వెంటనే సిట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఫైనల్ అన్న నిర్ణయానికి రావద్దని కోరారు. జరిగిన ఘటనపై మరోసారి సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు విష్ణుతో పాటు మరి కొందరు అత్యాచార ఘటనకు పాల్పడి ఉండవచ్చని బంధువులు, గ్రామస్తులకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఘటన స్థలంలో జరిగిన రక్తస్రావం, మద్యం బాటిళ్లు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరగక ముందే ఎలాంటి రాజకీయ కోణం చూడొద్దని జిల్లా ఎస్పీ మాట్లాడటం సమంజసం కాదన్నారు. రాజకీయ కోణం చూడాలని ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఎస్పీ స్టేట్‌మెంట్‌ను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. విష్ణు ఫోన్ కాల్ లిస్టును పరిశీలించి ఘటన సమయంలో ఎవరికి ఫోన్ చేశారన్న దాన్ని బయట పెట్టాలని కోరారు. కేసులో నిందితులు ఒకరి కంటే మించి ఉండటానికి అవకాశం ఉన్నందున సిట్‌తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందె కార్తీక్ మాదిగ, ఎరుకలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పుతాడి కుమార్, డీఎస్ మహేష్ తదితరులు ఉన్నారు.
కుక్కల దాడిలో 23 గొర్రె పిల్లలు మృతి
గోపాల్‌పేట: కుక్కలు దాడి చేయడంతో 23 గొర్రె పిల్లలు మరణించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధిత గొర్రెల కాపరి తెలిపిన వివరాల మేరకు.. రేవల్లి మండలంలోని తల్పునూరు గ్రామానికి చెందిన దొడ్డి మల్లేష్ 23 గొర్రె పిల్లలను తన పొలం వద్ద పెంచుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం మంద వద్ద ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా కుకులు దాడి చేయడంతో 23 గొర్రె పిల్లలు చనిపోయాయి. వాటి విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. రేవల్లి పశువైద్య అధికారులు మాట్లాడుతూ జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, బాధిత కాపరికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ


