సాక్షి, హైదరాబాద్: చలి తీవ్రతకు గ్రేటర్ నగరం వణుకుతోంది. శనివారం కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. సగటున కనిష్ట ఉష్ణోగ్రత 12.2 డిగ్రీలసెల్సియస్ నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ దాటడం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9 డిగ్రీలు, మౌలాలీలో 9.1 డిగ్రీలు నమోదయ్యాయి.
శివారులోని పటాన్‌చెరులో కనిష్ట ఉష్ణోగ్రత 7.2 డిగ్రీలు రికార్డు కాగా, సగటు కంటే 4.9 డిగ్రీలు తక్కువగా ఉంది. దీంతో వాతావరణ శాఖ కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. కోల్డ్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. చలి తీవ్రత డిసెంబర్ 24 వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తోంది. రాబోవు 7 రోజుల్లో హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 13 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రోడ్లపై పొగమంచు కారణంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.


