వైభవంగా ‘పదరా పోదాం మన్యంకొండ’
● గోవింద నామస్మరణతో సాగిన పాదయాత్ర
● యాత్రలో పాల్గొన్న వేలాదిమంది భక్తులు
స్టేషన్ మహబూబ్‌నగర్: ధర్మవాహిని పరిషత్ పాలమూరు ఆధ్వర్యంలో ఆదివారం ‘పదరా పోదాం మన్యంకొండ ’ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం బండ్లగేరిలోగల రుక్మిణి పాండురంగస్వామి దేవాలయం నుంచి దాదాపు 2500 మంది భక్తులు మన్యంకొండ ఆలయానికి పాదయాత్రగా వెళ్లారు. బండ్లగేరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాంమందిర్ చౌరస్తా, గ్రంథాలయం, వన్‌టౌన్, బండమీదిపల్లి, పాలమూరు యూనివర్సిటీ, ధర్మాపూర్ మీదుగా మన్యంకొండ దేవాలయం వరకు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో భక్తులు పాదయాత్రకు స్వాగతం పలికారు. లక్ష గోవింద నామస్మరణ, భజనలు, హరినామస్మరణతో భక్తియాత్ర మన్యంకొండ ఆలయం వరకు కొనసాగింది. ఉదయం 7 గంటల సమయంలో ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు మన్యంకొండ ఆలయానికి చేరుకుంది. పాదయాత్రకు దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదనాచారి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవాహిని పరిషత్ వ్యవస్థాపకులు జ్యోషి సంతోషాచార్యులు మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం మూడోసారి మన్యకొండకు పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. పాదయాత్రలో వేలాదిమంది మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, జేపీఎన్‌సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడుయాదిరెడ్డి, సంతోషాచార్యులు, స్వరలహరి కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు భాగన్నగౌడ్, మన్యంకొండ దేవస్థానం బోర్డు సభ్యులు శ్రవణ్‌కుమార్, శాంతన్న యాదవ్, డీకే ఆంజనేయులు, నరేందర్ పాల్గొన్నారు.
వైభవంగా ‘పదరా పోదాం మన్యంకొండ’


