పాలమూరులో మెగా క్రికెట్ టోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానం సోమవారం వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ ప్రారంభోత్సవానికి వేదికకానుంది. విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ మెగా టీ–20 లీగ్ నిర్వహించనున్నారు. ఈలీగ్ ప్రారంభోత్సవం అనంతరం ఆయా జిల్లాల్లో ఉమ్మడి జిల్లాస్థాయిల్లో లీగ్‌లు జరగనున్నాయి. లీగ్‌లో భాగంగా ఈనెల 27వ తేదీ వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జోన్‌స్థాయి లీగ్ జరగనుంది. ఐదు జట్లు పాల్గొంటుండగా లీగ్ తొలి మ్యాచ్‌లో మహబూబ్‌నగర్–నాగర్‌కర్నూల్ జట్లు తలపడనున్నాయి.
29 జిల్లాల క్రీడాకారుల రాక
తెలంగాణ అంతర్ జిల్లా టీ–20 లీగ్ ప్రారంభోత్సవంలో రాష్ట్రంలోని 29 జిల్లాల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. ఈ మెగా టోర్నీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, బీసీ సంక్షేమశాఖ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌సీఏ ప్రతినిధులు హాజరున్నారు.
సిద్ధమైన క్రికెట్ మైదానం
తెలంగాణ జిల్లాలోనే ఎండీసీఏ మైదానాన్ని తీర్చిదిద్దారు. జాతీయస్థాయిలో మ్యాచ్‌లు జరిగేలా మైదానంలో టర్ఫ్ వికెట్లు, గ్రీనరీ ఏర్పాటు చేశారు. దీంతో క్రికెట్ మైదానం అంతర్జాతీయ స్థాయి స్టేడియాన్ని తలపిస్తుంది. టీ–20 లీగ్ ప్రారంభోత్సవ వేడులకు ఎండీసీఏ క్రికెట్ మైదానాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేశారు. మూడురోజుల నుంచి మైదానంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎండీసీఏ మైదానాన్ని ఎస్పీ జానకి పరిశీలించారు. లీగ్ నిర్వహణ వివరాలను ఎండీసీఏ ప్రతినిధులతో అడిగి తెలుసుకున్నారు. మంత్రులు రానుండడంతో పోలీసులు గట్టిబందోబస్తు చర్యలు చేపట్టనున్నారు.
నేడు తెలంగాణ ఇంటర్‌డిస్ట్రిక్ టీ–20 లీగ్ ప్రారంభం
హాజరు కానున్న ఐదుగురు మంత్రులు, హెచ్‌సీఏ ప్రతినిధులు
టోర్నీలో పాల్గొననున్న 29 జిల్లాల జట్లు
ఏర్పాట్లు పూర్తిచేసిన ఎండీసీఏ
పాలమూరులో మెగా క్రికెట్ టోర్నీ


