సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న వారిని మరోసారి విచారించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు చెప్తేనే తాను ఫోన్లు ట్యాప్ చేయించానని గతంలో పోలీసులకు ప్రభాకర్ రావు తెలిపారు. ఈ క్రమంలో.. మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌తో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందాలను కూడా మరోసారి సిట్ విచారించినట్లు తెలుస్తోంది.
ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న మాజీ జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘనందన్, మాజీ సీఎస్‌లు సోమేష్‌కుమార్, శాంతికుమారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందాలను మరోసారి సాక్షులుగా విచారించి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని కొత్త సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్లను విచారించి.. అనుబంధ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావును ప్రస్తుతం రెండో దఫా కస్టోడియల్ విచారణ జరుపుతోంది సిట్. ఈ క్రమంలో కేసీఆర్ హయాంలో పని చేసిన సివిల్ సర్వెంట్స్ అధికారులను మరోసారి విచారించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే..
ఎస్‌ఐబీ ఓస్డీగా ప్రభాకర్‌రావును ఎలా నియమించారని సోమేష్‌కుమార్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే నవీన్ చంద్ హయాంలోనే ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు పని చేశారు. దీంతో.. ఎవరెవరి నెంబర్లు ప్రభాకర్ రావు ఇచ్చారనేదానిపై నవీన్ చంద్‌ను విచారించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. డిసెంబర్ 25వ తేదీతో ప్రభాకర్‌రావు కస్టడీ ముగియనుంది. ఈ క్రమంలో సిట్ కస్టోడియల్ ఎంక్వైరీ వేగం పుంజుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.


