42 శాతం మంది పురుషుల పరిస్థితి ఇది
విడాకుల తర్వాత కుప్పకూలుతున్న ఆర్థిక స్థితి
విడాకుల కోసం సగటున 5 లక్షల వ్యయం
వన్ ఫైనాన్స్ మ్యాగ్‌జైన్ సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఎన్నో ఆశలతో మూడుముళ్ల బంధంతో ఒకటైనవారు మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఎక్కువకాలం కలిసి జీవించలేక విడిపోతున్నారు. విడాకులకు సంబంధించిన న్యాయప్రక్రియ కోసం సగటున వీరు రూ.5 లక్షలు వరకు ఖర్చు చేస్తున్నారు. విడాకుల తర్వాత పురుషుల ఆర్థికస్థితి ఒక్కసారిగా కుప్ప కూలిపోతున్నట్లు వన్ ఫైనాన్స్ మ్యాగజైన్ తాజా సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా విడాకులు తీసుకున్న 1,258 జంటల ఆర్థిక స్థితిగతులను చూస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలు..
» 38 శాతం మంది పురుషులు వారి వార్షిక ఆదాయమంతా భరణం కోసం వెచ్చిస్తున్నారు.
» 42 శాతం మంది భరణం చెల్లించడం కోసం అప్పులు చేస్తున్నారు.
» 29 శాతం మంది పురుషుల ఆస్తి మొత్తం భరణం చెల్లింపుల తర్వాత మైనస్‌లోకి జారిపోతోంది.
» 26 శాతం మంది మహిళలు భరణంగా వారి భర్త నుంచి ఆస్తి తీసుకుంటున్నారు.
» ఆస్తులు లేకపోయినా మెయింటెనెన్స్ చెల్లించాల్సిన పరిస్థితిని వీరు ఎదుర్కొంటున్నారు.
» 56 శాతం మంది మహిళలు విడాకులు తీసుకోవడంలో అత్తమామలను ప్రధాన కారణంగా చూపుతున్నారు.
» 43 శాతం మహిళలకు సంబంధించిన ఆర్థిక అంశాలు, గొడవలు ప్రారంభమై విడాకులు తీసుకోడానికి కారణమవుతున్నాయి. పురుషుల విషయంలో ఇది 42 శాతంగా ఉంది.
» 23 శాతం మహిళలు విడాకుల తర్వాత అప్పటికి వారు ఉంటున్న ప్రదేశాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
» 30 శాతం మంది మహిళలు విడాకుల తర్వాత ఉద్యోగాలను వదిలేస్తున్నారు.
ఆరోగ్య బీమా తరహాలో ఆర్థిక ప్రణాళికలు!
విడాకుల తర్వాత తాము నిర్మించుకున్న ఆర్థిక ప్రపంచం ఒక్కసారిగా కుప్ప కూలిపోయిందని, చివరకు అప్పులు చేసి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు పురుషులు పేర్కొనడం గమనార్హం. ఆరోగ్య బీమా తరహాలో ‘అనుకోని పరిస్థితుల్లో విడాకుల వరకూ వెళ్లాల్సి వస్తే’ అని ఆలోచిస్తూ దానికి అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


