సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర తీసింది. మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేయించింది.
సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది. 2024 జులైలో వంశీ, ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డాడని తాజాగా ఆ వ్యక్తి మాచవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో.. వంశీ సహా మరో 20 మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఇక్కడ జరిగింది వేరు!.
2024 జూలై 7న విజయవాడలోని వంశీ ఇంటిపై టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, రాడ్లు, రాళ్లతో రెచ్చిపోయారు. అయితే వంశీ ఇంటిపై జరిగిన దాడిని.. తమ పైన దాడిగా రివర్స్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. పైగా ఫిర్యాదులో తమను ఉద్ధేశపూర్వకంగా రెచ్చగొట్టి.. దూషించి దాడి చేశారంటూ సునీల్ పేర్కొనడం గమనార్హం.

ఇంతకు ముందు.. వల్లభనేని వంశీని అక్రమ కేసుల్లో కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో నకిలీ ఇళ్ల పట్టాల కేసుతో వంశీని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఈ కేసులో విజయవాడ జైల్లో ఉన్న ఆయన.. నూజివీడు కోర్టు బెయిల్ ఇవ్వడంతో 137 రోజుల తర్వాత బయటకు వచ్చారు.


