న్యూఢిల్లీ: ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. 52 ఏళ్ల మహిళతో పాటు ఆమె ఇద్దరు కుమారులు (32-27 ఏళ్లు) ఆత్మహత్య చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీసులతో పాటు ఒక బెయిలిఫ్ వారి నివాసానికి చేరుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. పోలీసులు తలుపులు పదేపదే తట్టినా, లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, వారు నకిలీ తాళంచెవి సహాయంతో ఇంట్లోకి ప్రవేశించారు. లోపల తల్లి, ఆమె ఇద్దరు కుమారులు ఒకే గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.
చేతిరాత లేఖలో..
ఘటనా స్థలంలో లభ్యమైన ఒకటిన్నర పేజీల చేతిరాత లేఖ ఈ సామూహిక మరణాలకుగల గల కారణాలను వెల్లడించింది. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ లేఖలో బాధిత ఆ కుటుంబం చాలా కాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనే సమచారం ఉంది. ఆ లేఖలో బాధితులు తమ మానసిక వేదన, ఆర్థిక ఒత్తిడులే తమ ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఆ లేఖలోని వివరాల ప్రకారం ఆ కుమారులిద్దరూ నిరుద్యోగులు. నిరాశలో కుంగిపోయిన కారణంగా ఏ పనీ చేయలేకపోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. మరణించిన ఇద్దరు సోదరులలో చిన్నవాడు(27 ఏళ్లు) యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
అద్దె బకాయిలు, అప్పుల ఊబి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వారు కొని నెలలుగా నెలవారీ రూ. 25,000 అద్దెను కూడా చెల్లించలేకపోయారు. ఫలితంగా ఇంటి యజమాని కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. బాధిత కుటుంబం 2023, డిసెంబర్‌లో ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నది. నాడు ఆ మహిళ భర్త బతికే ఉన్నాడు. అతను ఒక ప్రాపర్టీ డీలర్‌గా పనిచేశాడు. అతను పరిచయస్తుల దగ్గర రుణాలు తీసుకున్నాడు. అతను 2024లో మరణించగా, ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కొంత కాలంగా ఆ కుటుంబంలోని వారు బయటకు రాకుండా ఆ ఇంటిలోనే కాలం గడుపుతున్నారు. ప్రాథమిక విచారణలో, రెండు నెలల క్రితం కూడా ఆ ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. పోలీసులు మృతదేహాలను ఎయిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ ఘటన వెనుక గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వారికి లభ్యమైన ఆత్మహత్య లేఖ, ఇతర పత్రాలు, డిజిటల్ పరికరాలను పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆకాశానికి రంగులు అద్దిన ఉల్కలు!


