కాల్పులు జరుపుతున్న సాజిద్ చేతుల్లోంచి గన్ లాక్కున్న అహ్మద్
పలువురి ప్రాణాలను కాపాడిన సాహసి
యువ ఉగ్రవాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన సిరియన్ శరణార్థి
సిడ్నీ: సిడ్నీ బీచ్‌లో అమాయక యూదులపై ఇష్టారీతిగా తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తున్న ఉగ్రవాది సాజిద్‌ను సాహసోపేతంగా నిలువరించిన 43 ఏళ్ల అహ్మద్–అల్–అహ్మద్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ధైర్యసాహసాలతో సాజిద్ చేతుల్లోంచి తుపాకీ లాక్కుని పలువురి ప్రాణాలను అహ్మద్ కాపాడారంటూ అతడిని జనం వేనోళ్ల పొగుడుతున్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక్క ఉదుటున సాజిద్‌పైకి దూకిన వైనం వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో అతని ధైర్యసాహసాల గురించే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.
కాపాడే క్రమంలో కన్నుమూశాడని చెప్పు...
దాడి జరిగినప్పుడు ఆదివారం ఉదయం అదే బాండీ బీచ్‌లో అహ్మద్ తన స్నేహితుడితో కలిసి రోడ్డు పక్కన కాఫీ తాగుతున్నాడు. ఉగ్రవాది సాజిద్ అక్కడివారిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతుంటే అహ్మద్ హతాశుడయ్యాడు. వెంటనే తేరుకుని ఎలాగైనా సాజిద్‌ను అడ్డుకుందామని నిశ్చయించుకున్నాడు. పక్కనే ఉన్న స్నేహితుడితో.. ‘‘ వాడిని అడ్డుకునేందుకు వెళ్తున్నా.
ఒకవేళ చనిపోతానేమో. నా కుటుంబాన్ని చూసుకో. అహ్మద్ ఎలా చనిపోయాడని నా వాళ్లు అడిగితే ప్రజల్ని కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు అర్పించాడని చెప్పు’’ అని అనేసి వెంటనే రంగంలోకి దూకాడు. కారు చాటుగా దాక్కుంటూ నెమ్మదిగా సాజిద్ వద్దకు చేరుకుని వెంటనే అతడి చేతిలోని పెద్దరైఫిల్‌ను పెనుగులాట తర్వాత లాక్కున్నాడు. సాజిద్‌కు రైఫిల్‌ను గురిపెట్టి అక్కడి నుంచి దూరంగా వెళ్లేలా చూశాడు. త
ర్వాత రైఫిల్‌ను కిందపెట్టేశాడు. అయితే దూరంగా ఉండి కాల్చుతున్న సాజిద్ కొడుకు నవీద్ ఇదంతా చూసి అహ్మద్ పైకి కాల్పులు జరపడం మొదలెట్టాడు. దీంతో పక్కన చెట్టుకు పెట్టిన రైఫిల్‌ను మళ్లీ చేతుల్లోకి తీసుకుని ప్రతిదాడి చేయబోయాడు. అయితే అప్పటికే టెలిస్కోపిక్‌గా సూటిగా కాలుస్తున్న నవీద్ బుల్లెట్ల ధాటికి అహ్మద్ నిలవలేకపోయాడు.
నవీద్ పేల్చిన బుల్లెట్లు అహ్మద్ భుజం, చేయి, అరచేతిలోకి దూసుకెళ్లాయి. ఆలోపు పోలీసులు రంగప్రవేశం చేయడంతో అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికే రక్తమోడుతున్న అహ్మద్‌ను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. న్యూసౌత్‌వేల్స్ అగ్రనేత క్రిస్ మిన్స్‌సహా పలువురు నేతలు, ఉన్నతాధికారులు అహ్మద్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు.
గతంలో సైన్యంలో పనిచేసిన అహ్మద్!
అహ్మద్ స్వస్థలం సిరియాలోని ఇడ్లిబ్ పట్టణం. 2006లో శరణార్థిగా ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవలే ఇతన తల్లిదండ్రులు సైతం సిరియా నుంచి ఇతని వద్దకు వచ్చేశారు. అహ్మద్ సిడ్నీ సమీప సదర్లాండ్‌లో సొంతంగా పండ్ల వ్యాపారం చేస్తున్నారు. అహ్మద్ గతంలో సైన్యంలో పనిచేసినట్లు వార్తలొచ్చాయి. అయితే సిరియాలోని అసద్ అల్ బషీర్ ప్రభుత్వంలోనా లేదంటే ఆస్ట్రేలియాలో సేవలందించారా అనేది తెలియాల్సి ఉంది. ప్రాణాలు ఎదురొడ్డి పలువురిని కాపాడిన అహ్మద్ ఇప్పుడు ఆస్పత్రిపాలవడంతో చికిత్స ఖర్చుల కోసం పలువురు దాతలు ముందుకొచ్చారు. ఆన్‌లైన్‌లో గోఫండ్‌మీ క్యాంపెయిన్ మొదలెట్టారు. ఇప్పటికే దాదాపు రూ. 8.61 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ‘‘సైన్యంలో చేసిన నా కుమారుడికి ప్రాణాల విలువ తెలుసు. అందుకే కాపాడేందుకు ఒక్క నిమిషం కూడా ఆలస్యంచేయకుండా పరుగెత్తాడు’’ అని అహ్మద్ తండ్రి మొహమ్మద్ ఫతే అన్నారు.


