రికార్డ్
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ ప్రచార కార్యక్రమం ‘స్వస్థ్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ (ఎస్‌ఎన్‌ఎస్పీఏ) మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను సాధించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం... ఈ ప్రచారం దేశంలోని ప్రతి జిల్లాకు చేరింది. 19.7 లక్షల ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఆరోగ్య వేదికలలో 11 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు.
ఒకే నెలలో 3.21 కోట్ల మందికి పైగా హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్‌లో పేర్లు నమోదు చేసుకోవడం, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఒకేవారంలో అత్యధికంగా 9.94 లక్షల మంది పేర్లు నమోదు చేసుకోవడం, హెల్త్ స్క్రీనింగ్ కోసం రాష్ట్ర స్థాయిలో ఒకే వారంలో 1.25 లక్షల మంది ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవడానికి సంబంధించి ‘ఎస్‌ఎన్‌ఎస్పీఏ’ గిన్నిస్ రికార్డ్‌లు సొంతం చేసుకుంది.
‘ఎస్‌ఎన్‌ఎస్పీఏ’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా 1.78 కోట్లమందికి పైగా రక్తపోటు, 1.73 కోట్ల మంది డయాబెటిస్, 69.5 లక్షల మందికి నోటి క్యాన్సర్ పరీక్షలు, 1.51 కోట్ల మందికి రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. 1.43 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయి. క్షయవ్యాధికి సంబంధించి 85.9 లక్షలకు పైగా మహిళలకు పరీక్షలు నిర్వహించారు.
కౌన్సెలింగ్, వెల్‌నెస్ సెషన్‌లలో 2.14 కోట్ల మంది పాల్గొన్నారు. ‘మై భారత్’ వాలంటీర్ల క్రియాశీల భాగస్వామ్యంతో 2.68 లక్షల మందికి పైగా నిక్షయ్ మిత్ర ప్రచారం కోసం పేరు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ జాతీయ టీబీ నిర్మూలన క్యాక్రమం (ఎన్‌టిఇపి) కింద క్షయ రోగులకు అండగా ఉండే వ్యక్తులకు ‘నిక్షయ్ మిత్ర’ బిరుదు ప్రదానం చేస్తారు.


