గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైతం కాలేయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తున్నదని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లో సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ళ పాటు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న 67 మంది రోగుల ఆరోగ్యంపై నిర్వహించిన అధ్యయనంలో బహుళ మల్టీ డ్రగ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఎండీఆర్) తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తేలిందన్నారు. 24 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉండగా మరి కొంత మందిలో ఇతర సమస్యలు ఉన్నాయన్నారు.
16 బ్యాక్టీరియా కేసుల్లో 15 మందిలో యాంటీ బయాటిక్స్‌కు పూర్తిగా రెసిస్టెంట్‌గా ఉండటం ఆందోళనకరంగా ఉందన్నారు. దీంతో పాటు కొన్ని కేసుల్లో యాక్సా జోలిడినోన్ తరగతికి చెందిన ఔషదాల పట్ల కూడా ప్రతిఘటన కనిపించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పాజిటీవ్ వచ్చిన 16 మందిలో తొమ్మిది మంది సర్జరీకి ముందే రక్త పరీక్షల్లో బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని వారు అప్పటికే ఎండీఆర్ బ్యాక్టీరియాతో ఉన్నారని వెల్లడి అయిందన్నారు. ఈ అధ్యయనం వల్ల ఆరోగ్య విధానాల్లో చికిత్సా పద్ధతుల్లో మార్పు అవసరం ఉన్నదని సూచిస్తోందన్నారు.
గత వందేళ్ళుగా రోగులకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నియంత్రించడమే ఆస్పత్రుల ప్రధాన లక్ష్యంగా ఉండేదని తాజా అధ్యయనంలో ఆస్పత్రికి వచ్చే ముందే వారిలో ఎండీఆర్ ఇన్ఫెక్షన్ ఉండటం పరిశీలిస్తే ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలు సరిపోవని తేలిందన్నారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు ముందే ఇలాంటి ఇన్ఫెక్షన్లను గుర్తించి నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది జాతీయ స్థాయిలో ఆరోగ్య సంక్షోభంగా భావించాల్సి ఉంటుందని ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు ఈ సమస్యపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లివర్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ ఎ. గోగినేని తదితరులు పాల్గొన్నారు.


