
హైదరాబాద్ వైద్యుడితో కూడిన నిపుణుల కీలక అధ్యయనం
'లాన్సెట్ క్లినికల్ మెడిసిన్'లో ప్రచురణ
హైదరాబాద్: స్వల్పకాలిక యాంటీబయాటిక్ చికిత్సలతోనే నవజాత శిశువుల్లో ఇన్ఫెక్షన్లను నయం చేయొచ్చని శిశు వైద్య నిపుణులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్ ఫెర్నాండెజ్ హాస్పిటల్‌కి చెందిన డా. సాయికిరణ్.డితో సహా భారతీయ నియోనాటాలజీ నిపుణుల బృందం ప్రముఖ జర్నల్ ‘లాన్సెట్ క్లినికల్ మెడిసిన్’లో కీలక అధ్యయనాన్ని ప్రచురించింది. సాధారణంగా తీవ్రమైన నవజాత ఇన్ఫెక్షన్లకు 10–14 రోజుల యాంటీబయాటిక్ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. కానీ వీటిలో చాలావాటిని 7 రోజుల స్వల్ప కాలిక చికిత్సలతోనే నయం చేయొచ్చని ఈ అధ్యయనంలో తేల్చారు.
అధికంగా లేదా ఎక్కువకాలం యాంటీబయాటిక్స్ వాడకం ద్వారా వ్యాధికారక బ్యాక్టీరియా ప్రతిరోధకత పెరగడంతోపాటు దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, దీంతో ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకంగా అకాల లేదా అనారోగ్యంతో జన్మించిన శిశువులు ఎక్కువగా యాంటీబయాటిక్స్‌కు లోనవుతున్నారు.
శిశువుల ఇన్ఫెక్షన్లపై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక యాంటీబయాటిక్ చికిత్సల ప్రభావాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించారు. ముఖ్యంగా “బయోమార్కర్స్” ఆధారంగా చికిత్స కొనసాగింపును నిర్ణయించడం మెరుగైన ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. రక్త పరీక్షల ద్వారా సంక్రమణ తగ్గుతుందా లేదా అన్న విషయాన్ని గమనించి, అవసరమైనప్పుడు చికిత్స ఆపడం సాధ్యమవుతుంది.
అధ్యయన ఫలితాల్లో కీలకాంశాలు
10–14 రోజుల చికిత్సల స్థానంలో 7 రోజుల స్వల్పకాలిక చికిత్స చాలా సందర్భాల్లో సరిపోతుందని తేలింది.
“బయోమార్కర్” పరీక్షలు చికిత్స నిర్ణయానికి సహాయపడతాయి.
అయితే 3–4 రోజుల చికిత్సకు, 5–7 రోజుల చికిత్స మధ్య తేడాపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ అంశంలో ఇంకా పరిశోధన అవసరం.
మూత్ర సంక్రమణ, మెనింజైటిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లపై మరింత స్పష్టత అవసరం.