
వాటితో పెరుగుతున్న మరణాలు, తీవ్ర వ్యాధులు
ఆయుర్దాయం పెరిగినా తగ్గని ఎన్‌సీడీల బెడద
లాన్సెట్ తాజా అధ్యయనంలో ఆసక్తికర విశేషాలు
అసాంక్రమిక వ్యాధులు మానవాళి బతుకును భారంగా మారుస్తున్నాయి. జీవన నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. అకాల మరణాలపాలు చేస్తున్నాయి. మనుషులను రోగ పీడితులుగా, విగత జీవులుగా మార్చటంలో అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీలు) పాత్ర మూడింట రెండు వంతులని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) తాజా అధ్యయనం వెల్లడించింది.
1990లలో ప్రపంచ ప్రజల మధ్యస్థ ఆయుర్దాయం (మీన్ ఏజ్) 46.8 ఏళ్లు. 2023 నాటికి అది 63.4 ఏళ్లకు పెరిగింది. ఇది మానవ జాతి సాధించిన గొప్ప విజయాల్లో అత్యంత ప్రధానమైనది. అయినప్పటికీ హార్ట్ స్ట్రోక్, టైప్ 2 మధుమేహం, ఐహెచ్‌డీ (గుండెకు తగినంత రక్తం అందకపోవటాన్ని ఇస్కీమిక్ గుండె వ్యాధి అంటారు) వంటి అసాంక్రమిక వ్యాధుల బారిన పడిన మనుషుల్లో మూడింట రెండొంతుల మంది చనిపోవటమో, తీవ్రంగా జబ్బుపడి జీవన నాణ్యతను కోల్పోవటమో జరుగుతోంది. అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ తాజా సంచికలో ప్రచురితమైన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) అధ్యయనం రోగగ్రస్త జీవన నష్టాల తీవ్రతను తెలిపే ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది.
వాటిలో మార్పు తేగలిగితే..: పురుషుల మధ్యస్థ ఆయుర్దాయం 45.4 ఏళ్ల నుంచి 61.2 ఏళ్లకు, మహిళల ఆయుర్దాయం 48.5 నుంచి 65.9 ఏళ్లకు పెరిగింది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, అధిక బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) వంటి కొన్ని ప్రధాన ఆరోగ్య సూచికల్లో మార్పు తేగలిగితే సగానికి సగం అకాల మరణాలు, రోగగ్రస్త జీవనం నుంచి మనుషులను రక్షించవచ్చని పరిశోధకుల అంచనా.
భారీగా తగ్గిన జీవన నష్టం..: అకాల మరణం వల్ల కోల్పోయిన సంవత్సరాలను ‘జీవిత నష్ట సంవత్సరాలు (ఇయర్స్ ఆఫ్ లైఫ్ లాస్ట్–వైఎల్‌ఎల్)’ పేరిట గణాంక శాస్త్రవేత్తలు లెక్కిస్తారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, టీబీ, పౌష్టికాహార లోపాలు, ఇతర సాంక్రమిక వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాలు గత 30 ఏళ్లలో గణనీయంగా తగ్గాయని పరిశోధకులు తెలిపారు.
5 ఏళ్లలోపు పిల్లలే!
2023లో ప్రపంచవ్యాప్తంగా 6.01 కోట్ల మంది మృత్యువాతపడ్డారు. అందులో 46.7 లక్షల మంది ఐదేళ్ల లోపు పిల్లలు! 1950 తర్వాత జనాభా సంఖ్య, వృద్ధుల శాతం పెరుగుతున్న నేపథ్యంలో 1950–2023 మధ్య కాలంలో ప్రపంచ సగటు మరణాల సంఖ్య 35.2% పెరిగింది. అయితే, ఇదే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలు, వయసుల వ్యత్యాసాలను ప్రామాణీకరించి శాస్త్రీయంగా విశ్లేషించి చూస్తే.. మరణాల రేటు 66.6% తగ్గటం శుభపరిణామమని ఈ అధ్యయనం వెల్లడించింది.
12.6% తగ్గిన వ్యాధుల భారం
ప్రపంచవ్యాప్తంగా 204 దేశాల్లో ప్రజలను వయసు, లింగం, సకల వ్యాధి కారక మరణాలు, ఆయుర్దాయం తదితర అంశాలను పరిశీలిస్తే గతంలో కన్నా ఆరోగ్యస్థితి మెరుగ్గానే ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. వయసు– ప్రామాణిక వైకల్యం సర్దుబాటు చేసిన జీవిత సంవత్సరం (డిజŒ అబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్–డాలీ) రేటు అనేది యావత్ జనాభాపై ఉన్న వ్యాధి భారాన్ని లెక్కించడానికి ఉపయోగపడే ఒక కొలబద్ద. వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లో భిన్న వయస్కులతో కూడిన జనాభా ఉంటారు. వారి అందరిపై గల వ్యాధుల భారాన్ని సముచితంగా పోల్చి విశ్లేషించే క్రమంలో ఎదురయ్యే వ్యత్యాసాలను గణాంకపరంగా సర్దుబాటు చేయటానికి ఉపయోగపడే సంవత్సరాల సంఖ్యను ‘డాలీ’లలో లెక్కిస్తారు. 2010–2023 మధ్యలో వ్యాధుల భారం 12.6% డాలీల మేరకు తగ్గాయని అధ్యయనం పేర్కొంది.
పెరిగిన మానసిక రుగ్మతలు
మానసిక రుగ్మతలు ముఖ్యంగా మనో వ్యాకులత, కుంగుబాటు వంటివి 2010 తర్వాత భారీగా పెరిగాయని ఈ అధ్యయనం తెలిపింది. వ్యాధుల భారాన్ని పెంచుతున్న 26 అంశాల్లో సిర్రోరిస్, క్రానిక్ లివర్ డిసీజ్, అల్జీమర్స్ (మతిమరుపు) వంటివి ఉన్నాయి. 2023లో గుర్తించిన అత్యధిక హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్లలో ఉన్న కొన్ని ప్రధానాంశాలు.. అధిక రక్తపోటు, గాలిలో అధికంగా ఉండే సూక్ష్మ కణాలు, అధిక గ్లూకోజ్, ధూమపానం, అధిక బీఎంఐ, తక్కువ బరువు ఉండే శిశు జననాలు, నెలలు నిండకముందు జన్మించే పిల్లల సంఖ్య.
నివారించదగిన జబ్బులపై దృష్టి
యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్(ఐహెచ్‌ఎంఈ) డైరెక్టర్ డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రేతో పాటు మరో 16,500 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. పెరుగుతున్న వయోవృద్ధుల సంఖ్య, పుట్టుకొస్తున్న కొత్త సమస్యలు ప్రపంచ ఆరోగ్య సవాళ్లుగా మారుతున్నాయని ముర్రే వ్యాఖ్యానించారు. ప్రపంచ జనాభాపై జబ్బుల భారం గురించి తాజా అధ్యయనం వెల్లడించిన వాస్తవ గణాంకాలు పాలకులకు మేలైన ప్రజారోగ్య విధానాల రూపకల్పనకు మేలుకొలుపు కావాలన్నారు.