
బరేలీ: అది యూపీలోని బరేలీ పరిధిలోగల షాజహాన్ పూర్.. బహగుల్ నది వంతెన సమీపం నుంచి పశువుల కాపరి డబ్లూ తన మేకలను మేపుతూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అక్కడి ఒక మట్టి దిబ్బ నుండి శిశువు ఆర్తనాదాలు అతనికి వినిపించాయి. దగ్గరకు వెళ్లి చూసిన డబ్లూ కంగుతిన్నాడు. మట్టిదిబ్బలో నుంచి చీమలు పట్టిన ఒక లేలేత చేయి బయటకు రావడాన్ని గమనించాడు.
ఆ లేలేల చేయి నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతోంది. వందలాది చీమలు ఆ చేతిని పీక్కుతింటున్నాయి. ఒక్క చేయి తప్ప మిగిలిన శరీర భాగమంతా భూమిలో కప్పబడి ఉంది.. డబ్లూ మాటల్లో..‘నేను చూస్తున్నది నమ్మలేకపోయాను. వెంటనే పెద్దగా కేకలు వేశాను. పోలీసులకు సమాచారం ఇచ్చేలోగానే అక్కడున్నవారందరినీ పిలిచాను. వారు సంఘటనా స్థలంలో గుమిగూడారు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన పోలీసు బృందం మట్టి దిబ్బ నుంచి శిశువును జాగ్రత్తగా బయటకు బయటకు తీసింది. రోజుల శిశువు శరీరం బురదతో ముద్దయిపోయివుంది. శిశువు అత్యంత దుర్బర స్థితిలో ఉంది. శిశువును వెంటనే స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందించారు. వైద్యులు శిశివు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశాక, ప్రభుత్వ వైద్య కళాశాలకు రిఫర్ చేశారు’ అని తెలిపాడు.
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ‘శిశువు వయసు దాదాపు 15 రోజులుంటుంది. చాలా బలహీనంగా ఉంది. ఆ శిశువును తీసుకువచ్చే సమయానికే తీవ్ర గాయాలున్నాయి. శిశువు చేతిని చీమలు తీవ్రంగా కుట్టాయి. విపరీతంగా రక్తస్రావం అయ్యింది. శశువు ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంది, పరిస్థితి విషమంగా ఉంది’ అని అన్నారు. పోలీసులు మీడియాతో మాట్లాడుతూ ‘ఆ చిన్నారిని ఒక అడుగు లోతులో పాతిపెట్టారు. శిశువు శ్వాస తీసుకునేందుకు వీలుగా ఉద్దేశపూర్వకంగా గాలి ఆడేందుకు చిన్న ఖాళీ స్థలం ఉంచారు. ఈ ఘటనకు కారకులైనవారిని గుర్తించేందుకు బాహుల్ నది రోడ్డు వెంబడి ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నాం’ అని అన్నారు. జైతిపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ గౌరవ్ త్యాగి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.