హిందూపురం: పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. లడ్డూ ఇస్తానని ఆశ చూపి పసిమొగ్గపై కామాంధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. స్థానికులు విషయం తెలుసుకుని కామాంధునికి దేహశుద్ధి చేసి, అనంతరం పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ కాలనీలో చేనేత కార్మికుడు నివాసం ఉంటున్నాడు. ఈయన భార్య రెండేళ్ల క్రితం మృతి చెందింది. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె నాలుగో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాల ముగించుకుని పెద్దనాన్న ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి సొంతింటికి వస్తుండగా వరుసకు తాత అయిన గోపీ అనే 55 ఏళ్ల వ్యక్తి బాలికను పిలిచి.. లడ్డూ ప్రసాదమిస్తానని ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం తలుపు వేసి.. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించబోయాడు. బాలిక భయపడిపోయి గట్టిగా కేకలు వేసింది.
అదే సమయంలో ఎవరో బయట నుంచి పిలవడంతో గోపీ తలుపు కొద్దిగా తెరవగానే సందులోంచి బాలిక బయటకు పరుగులు తీసి ఇంటికి చేరుకుంది. తల్లిలేని ఆ బాలిక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడ్చుకుంటూ కూర్చుండిపోయింది. పొరుగింటి మహిళ దగ్గరకు తీసుకుని విషయం ఆరా తీసింది. పాపను సముదాయించి కాలనీవాసులతో కలిసి గోపీ ఇంటికి వెళ్లి నిలదీశారు. స్తంభానికి కట్టేసి చితకబాది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే రోజు రాత్రి గోపీని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన బాలికను వైద్య పరీక్షలకు పంపాల్సిన పోలీసులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సీపీఎం, కేవీపీఎస్ నాయకులతో కలిసి చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు.
కామాంధున్ని కఠినంగా శిక్షించాలి
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం చేయాలని మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి వీఆర్ రాము, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షురాలు జ్యోతమ్మ మాట్లాడుతూ బాధితురాలిని ఆస్పత్రికి తరలించడంలో పోలీసులు, చికిత్స అందించడంలో వైద్య సిబ్బంది చేసిన నిర్లక్ష్యంపై మండిపడ్డారు. పసిపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేకు ఇన్‌చార్జ్ తహసీల్దార్ మైనుద్దీన్‌కు వినతిపత్రం అందించారు.


