
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలోని తాగునీటి చెరువు
మూడు నెలల్లో 45మంది మృత్యువాత
మెలియోడోసిస్ ఇన్‌ఫెక్షన్ అంటున్న వైద్యశాఖ
స్పష్టమైన కారణాలు ఇంకా తెలియని వైనం
తొలుత జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు
ఆపై క్రమక్రమంగా రోగనిరోధక శక్తి క్షీణత
చివరకు ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణాలు
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న అధికార యంత్రాంగం
గుంటూరు వైద్య కళాశాల ల్యాబ్‌కు రక్తనమూనాలు
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: ప్రజారోగ్య పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతోంది. గతేడాది విజయనగరం జిల్లా గుర్లలో కలరా బారినపడి అమాయకులు మృత్యువాత పడిగా, ఇప్పుడు గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో తాజాగా తలెత్తిన మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన మే నుంచి ఇప్పటి వరకూ గ్రామంలో 45 మంది వరకూ మృత్యువాతకు గురయ్యారని సమాచారం అందుతుండగా, అధికారికంగానే ఈ సంఖ్య 30గా ఉంది. మృత్యువాతకు గురైన వారిలో ఎక్కువ మంది 18 నుంచి 50 ఏళ్ళలోపు వారే కావటం గమనార్హం. ప్రమాదకరమైన మెలియోడోసిస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఈ మరణాలు సంభవించినట్టు వైద్య శాఖ అనుమానిస్తోంది.
ఎవరిపై ఎక్కువ ప్రభావం
బర్ఖోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా సోకిన వారిలో ప్రమాదకరమైన మెలియోడోసిస్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. షుగర్, లివర్, కిడ్నీకి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి భారత్‌సహా దక్షిణ ఆసియాలోని ఇతర ఉష్ణమండల ప్రాంతాలలో వర్షా కాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు మొదలై క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణించి చివరకు ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణాలు సంభవిస్తాయి.
తీవ్ర నిర్లక్ష్యం
డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాల కేసులు కొంత అనుమానాస్పదంగా నమోదయితే చాలు.. ఆ ప్రాంతంలో సర్వేలెన్స్ పెట్టి కేసులు నమోదుకు గల కారణాలను అన్వేíÙంచాలి. అలాంటిది పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.
ప్రైవేట్ ఆస్పత్రిలో మెలియోడోసిస్ ఇన్‌ఫెక్షన్ అని నిర్ధారించిన 3వారాల అనంతరం ప్రత్యేక బృందాలను తురకపాలెంకు పంపి ప్రభుత్వం హడావుడి చేసింది. గ్రామంలో ఇప్పటికే 45 మంది మృతిచెందగా, 29 మంది బాధితుల నుంచి రక్తనమూనాలు తీసి గుంటూరు వైద్య కళాశాల ల్యాబ్‌కు పంపారు. ఇన్‌ఫెక్షన్ నిర్ధారణకు బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం డీఎంహెచ్‌వో బృందం ప్రజల నుంచి రక్తనమూనాల సేకరించింది.
క్షణ క్షణం.. భయం భయం
ఈ గ్రామం అంటే భయం ఏ స్థాయికి చేరిందంటే, బంధువులుసహా బయటి వ్యక్తులు ఎవ్వరూ గ్రామానికి రావడం లేదు. రాత్రి 8 దాటితే గ్రామంలో ఎవ్వరూ సంచరించడం లేదు.
అతిసారంతో వృద్ధురాలి మృతి
తిరుపతికి చెందిన సుభద్ర(75) ఆదివారం ఓ విందులో పాల్గొన్నారు. అనంతరం వాంతులు, విరోచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మరణించింది. విందులో పాల్గొన్న మరో 40 మంది కూడా ఆస్పత్రి పాలయ్యారు.
రక్త నమూనాల పరీక్షల కోసం ఎదురుచూస్తున్నాం: వైద్య బృందం
ఈ మరణాలు మెలియోడోసిస్ కారణంగా జరిగాయా లేదా అన్న విషయం శనివారంలోగా అందే రక్త నమూనాల పరీక్షల నివేదిక ఫలితాల ద్వారా తెలుస్తుందని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషషన్ (డీఎంఈ) డాక్టర్ రఘునందన్ పేర్కొన్నారు. డాక్టర్ రఘునందన్ నేతృత్వంలోని వైద్య బృందం బుధవారం బాధిత గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రఘునందన్ ఏమన్నారంటే, ‘‘ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో ఇద్దరు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు.
ఇప్పటి వరకు జ్వరంతో ఉన్న 29 మంది నుంచి సేకరించిన రక్తనమూనాలను గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని మైక్రోబయోలజీ ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే మెలియోడోసిస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐవీ యాంటీబయోటిక్ చికిత్స ద్వారా రోగులు కోలుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ బృందంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి ఇతర అధికారులు ఉన్నారు.
వెల్దుర్తిలో ముగ్గురికి డెంగీ లక్షణాలు
కర్నూలు జిల్లా వెల్దురిలో ఇటీవల డెంగీ బారిన పడి చిన్నారి మోక్షిత మృతి చెందగా.. తాజాగా మరో ముగ్గురిలో డెంగీ లక్షణాలు కనిపించాయి. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో 15వ వార్డు ఓవర్‌హెడ్ ట్యాంకు వద్ద ఏడాది చిన్నారి, అదే వార్డుకు చెందిన నిఖిల్.. 7వ వార్డుకు చెందిన ఇంటర్ విద్యార్థి డెంగీ లక్షణాలతో చేరారు.
కారణాలు.. అనుమానాలు!
» గ్రామంలో పారిశుధ్యం క్షీణించడం తాగునీరు కలుషితం కావడం
» సమీప క్వారీల నుంచి వెలువడే దుమ్ము, ధూళి
» నాసిరకం మద్యం
వరుస మరణాలతో గ్రామంలోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మా ఊరికి అసలు చుట్టాలు రావాలంటేనే భయపడిపోతున్నారు. గ్రామంలో ఏం జరుగుతోందో అర్థం కావటంలేదు. మా కళ్లముందే బాగా తిరుగుతున్న వ్యక్తులు ఉన్నట్టుండి ఒక్కసారిగా జ్వరాల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. – తురకా దాసు, తురకపాలెం గ్రామస్తుడు.