
ఇటీవలకాలంలో చాలామంది ఔషధాలకు లొంగని రక్తపోటుతో బాధపడుతున్నారు. అంతేగాదు ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ ప్రకారం..సుమారు 20 కోట్ల మందికి పైగా అధిక రకపోటుతో బాధపడుతున్నట్లు అంచనా. అందులో రెండు కోట్ల మంది ఈ సమస్యను నియంత్రణలో ఉంచుకున్నట్లు నివేదికల్లో తేలింది. ప్రస్తుతం ఇది అత్యంత అత్యవసర ప్రజారోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి దీనిపై వర్క్‌షాష్ నిర్వహించింది.
ఆ ఆస్పత్రి వైద్యులు దేశంలో క్రమంగా రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్ క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేయడమే అందుకు మంచి ఫలితాలనందిస్తున్న మూత్రపిండ నిర్మూలన చికిత్స(Renal Denervation - RDN) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ మేరక సదరు ఆస్ప్రతి వైద్యులు ఈ రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్(అధిక రక్తపోటు) కారణంగా తరచుగా తలనొప్పి, తలతిరగడం, ఊపిరి ఆడకపోవడం లేదా అప్పుడప్పుడు ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు.
అదీగాక కాలక్రమేణా, నిరంతరం పెరిగిన రక్తపోటు హృదయనాళ వ్యవస్థ, ఇతర ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చిరించారు. అందువల్ల ముందుగా ఈ అధిక రక్తపోటుని 10 mmHg తగ్గించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 20%, స్ట్రోక్ ప్రమాదాన్ని 27% మేర తగ్గించగలమని క్లినికల్ అద్యనాలు వెల్లడించాయని చెప్పారు.
ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న యాంటీహైపర్‌టెన్సివ్ మందులు చాలా మందికి ప్రభావవంతంగా ఉన్నప్పటికీ..గణనీయమైన సంఖ్యలో కొందరు రోగుల్లో ఈ నియంత్రణ కష్టంగా ఉందన్నారు. అలాంటి పేషెంట్లకు ఈ రీనల్ డెనర్వేషన్ (RDN) అనేది ఒక ఆశాజనకమైన చికిత్స అని చెప్పారు. అంతేగాదు ఆ చికిత్స పొంది.. మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్న రోగుల గురించి కూడా ఈ వర్క్‌షాప్‌లో వివరించారు.
ఈ నియంత్రణలేని అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచడమే కాకుండా అధిక ఆరోగ్య సంరక్షణ ఖర్చులు భారాన్ని మోపడమే గాక, ఆస్పత్రి పాలయ్యేలా చేస్తుందని నొక్కి చెప్పారు. అందువల్ల ముందుగానే ఈ అధిక రక్తపోటును ఆర్‌డీఎన్ వంటి చికిత్సలతో మెరుగుపరుచుకుంటే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతామని అన్నారు వైద్యులు.
(చదవండి: 'ఆ వయసులోనూ ఇంత అందంగానా'..? విస్తుపోయిన బరాక్ ఒబామా)