సాక్షి,హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని గణేశ్‌నగర్‌లో ఓ చిన్నారి అదృష్టాన్ని తనవైపు తిప్పుకుంది.పది నెలల హన్సికకు రూ.16 లక్షల విలువైన 66 గజాల స్థలం,అందులో నిర్మించిన ఇల్లు కేవలం రూ.500కే లభించింది. ఆదివారం నిర్వహించిన లక్కీ డ్రాలో నిర్వాహకులు ఆమెను విజేతగా ప్రకటించారు. దీంతో ఆ ఇంట్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో హోటల్‌లో పనిచేస్తున్న శంకర్, తన భార్య ప్రశాంతి, కుమార్తెలు సాయి రిషిక, హన్సికల పేరుతో నాలుగు కూపన్లు కొనుగోలు చేశారు. అదృష్టం వెతుక్కుంటూ హన్సికను ఎంపిక చేసింది. లక్కీడ్రాలో హన్సిక ఎంపికైనట్లు నిర్వాహకులు తండ్రి శంకర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.రూ.500కే 66గజాల స్థలం దక్కడంతో ఎగిరి గంతేసినంత పనిచేశారు.

ఇక 66 గజాల ఇంటి స్థలం అమ్మేందుకు దాని యజమాని కంచర్ల రామబ్రహ్మం లక్కీ డ్రా నిర్వహించారు. 66 సెంట్ల స్థలం, అందులో ఉన్న ఇంటి యజమాని కంచర్ల రామబ్రహ్మం. తనకు డబ్బు అవసరమై, సంప్రదాయ రీతిని పక్కనపెట్టి వినూత్నంగా ఆస్తిని విక్రయించేందుకు రూ.500కే లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకున్నారు. నవంబర్ 2న లక్కీ డ్రా నిర్వహించి విజేతకు ఇల్లు, స్థలం రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రకటించారు.
ఈ ఆలోచన వినూత్నంగా ఉండటంతో 3,600 మంది తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు కూపన్లు కొనుగోలు చేశారు. దీంతో రామబ్రహ్మంకు రూ.18 లక్షలు సమకూరాయి. విజేతగా హన్సిక నిలిచింది. త్వరలో యజమాని హన్సిక కుటుంబం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయనున్నారు.


