breaking news
Rent Act
-
ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి..
దేశంలో అద్దె గృహాల విభాగంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా అద్దె ఒప్పందాలను సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచడం, యజమానులు-అద్దెదారుల మధ్య వివాదాలను తగ్గించడం లక్ష్యంగా మార్పులు ప్రతిపాదించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా రూపొందించిన ‘మోడల్ టెనెన్సీ యాక్ట్ (MTA) 2025’ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపించారు.ఈ ఎంటీఏ 2025 అనేది చట్టబద్ధమైన కేంద్ర చట్టం కానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రస్తుత అద్దె నియంత్రణ చట్టాలను సవరించడానికి లేదా కొత్త చట్టాలను రూపొందించడానికి ఇది ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. భూమి, ఆస్తి, అద్దె వ్యవహారాలు రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా (ఎంట్రీ 18) పరిధిలోకి వస్తాయి కాబట్టి, రాష్ట్ర శాసనసభల ఆమోదం ద్వారా మాత్రమే ఈ మార్గదర్శకాలు చట్ట రూపం దాలుస్తాయని గుర్తుంచుకోవాలి.మార్గదర్శకాల్లోని వివరాలునివాస (రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ఆస్తుల కోసం చేసుకున్న అన్ని అద్దె ఒప్పందాలను సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంపింగ్‌తో ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో చేతితో రాసిన ఒప్పందాలు లేదా సాధారణ స్టాంప్ పేపర్ ఒప్పందాలు మాత్రమే ఉండేవి. దీనివల్ల మోసాలు, అక్రమ ఆక్రమణలు, డూప్లికేట్ ఒప్పందాలకు అవకాశం ఉండేది. దీన్ని కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంది.ఒప్పందాన్ని నమోదు చేయడంలో విఫలమైతే భూస్వామికి రూ.5,000 వరకు జరిమానా విధించే వీలుంది.ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అద్దెదారులు 8 నుంచి 11 నెలల అద్దెను డిపాజిట్‌గా చెల్లించాల్సిన భారం ఉంది. ఎంటీఏ 2025 ఈ భారాన్ని తగ్గిస్తూ సెక్యూరిటీ డిపాజిట్‌పై కచ్చితమైన పరిమితిని విధించింది.నివాస గృహాలకు గరిష్ఠంగా 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్‌గా తీసుకోవచ్చు.వాణిజ్య ఆస్తులకు గరిష్ఠంగా 6 నెలల అద్దె వరకు మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంది.ఆకస్మికంగా లేదా అతిగా అద్దె పెంచే విధానానికి కొత్త చట్టం అడ్డుకట్ట వేస్తుంది. యజమానులు అద్దెను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెంచడానికి అనుమతి ఉంటుంది. అంతేకాకుండా అద్దె పెంపునకు సంబంధించిన రాతపూర్వక నోటీసును అద్దెదారుకు కనీసం 90 రోజుల ముందు తప్పనిసరిగా ఇవ్వాలి.రెంట్ ట్రిబ్యునల్ ఆదేశం లేకుండా ఏ అద్దెదారునైనా బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించడం పూర్తిగా నిషేధం.ఇంటిని తనిఖీ చేయడానికి లేదా ప్రవేశించడానికి కనీసం 24 గంటల ముందు యజమాని అద్దెదారుకు రాతపూర్వక నోటీసు ఇవ్వాలి.అద్దెదారుపై ఒత్తిడి తెచ్చేందుకు లాకౌట్ (తాళం వేయడం), విద్యుత్/నీటి సరఫరాను నిలిపివేయడం, బెదిరింపులకు పాల్పడటం శిక్షార్హమైన నేరాలు.అవసరమైన మరమ్మతులను యజమాని 30 రోజుల్లో పూర్తి చేయకపోతే అద్దెదారు స్వయంగా వాటిని చేయించుకుని బిల్లు చూపి ఆ ఖర్చును తదుపరి అద్దె నుంచి మినహాయించుకునే వెసులుబాటు ఉంది.అద్దెదారులు తప్పనిసరిగా పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది అద్దె ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.రాష్ట్రాల స్పందన, అమలుపై అంచనాలు..కేంద్రం రాష్ట్రాలను తమ డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా అప్‌గ్రేడ్ చేసుకోవాలని కోరింది. ఇప్పటివరకు ఒడిషా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, త్రిపుర వంటి 10కి పైగా రాష్ట్రాలు ఇప్పటికే ఎంటీఏ మార్గదర్శకాల ఆధారంగా తమ అద్దె చట్టాలను సవరించాయి. అందులో కొన్ని కొత్త చట్టాలను రూపొందించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా 2026 నాటికి ఈ కొత్త నియమాలను అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: టెక్ తొలగింపులకు కారణం ఏమిటంటే: ఐబీఎం సీఈఓ -
త్వరలో అద్దె చట్టం
న్యూఢిల్లీ: దేశంలో భవనాలు, స్థలాలను అద్దెకు ఇవ్వడానికి సంబంధించి పలు నిబంధనలను రూపొందిస్తూ ‘అద్దె చట్టం’ తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై ఆగస్టు 1లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చు. స్థల/భవన యజమానులతోపాటు అద్దెకు ఉండేవారు నష్టపోకుండా ఉండటం కోసం కేంద్రం పలు నిబంధనలను ఈ బిల్లులో ప్రతిపాదించింది. బిల్లులోని కొన్ని ప్రతిపాదనలు.. ► అద్దె పెంచాలంటే 3నెలల ముందే ఆ విషయాన్ని కిరాయిదారుకు యజమాని రాతపూర్వకంగా తెలియజెప్పాలి. ► అద్దెకు భవనం/స్థలం తీసుకున్నవారు ముందుగా ఒప్పందం చేసుకున్న కాలం కంటే ఎక్కువ రోజులు అక్కడ ఉంటూ, సమయానికి ఖాళీ చేయకపోతే 2–4 రెట్లు అధిక అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ► అడ్వాన్స్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ కింద యజమానులు వసూలు చేసే డబ్బు రెండు నెలల అద్దె కంటే ఎక్కువ ఉండకూడదు. ► ఇంట్లో ఏదైనా రిపేర్లు చేయించాల్సి వచ్చి, ఆ విషయాన్ని యజమాని పట్టించుకోకపోతే అద్దెకు ఉంటున్నవారు ఆ రిపేర్లు చేయించి, అందుకు అయిన వ్యయాన్ని అద్దెలో మినహాయించుకోవచ్చు. ఆ రిపేర్లు అద్దెకు ఉంటున్న వారే చేయించాల్సినవి అయినప్పటికీ వారు పట్టించుకోకపోతే, యజమాని ఆ పనిని చేపించి, అందుకు అయిన వ్యయాన్ని అడ్వాన్సు/సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకోవచ్చు. ► యజమానులు, కిరాయిదారుల ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా అద్దె వ్యవహారాల విభాగం ఏర్పాటు ► అద్దె ఒప్పందం కుదుర్చుకున్న రెండు నెలల్లోపు యజయాని, అద్దెకు వచ్చిన వారు.. ఇద్దరూ వెళ్లి అద్దె ఒప్పంద పత్రాన్ని జిల్లా అద్దె వ్యవహారాల విభాగానికి సమర్పించాలి. ఈ విభాగానికి అద్దెను నిర్ణయించడం, సవరించడం వంటి అధికారాలు కూడా ఉంటాయి. ఢిల్లీలో నకిలీ దరఖాస్తులపై ఎఫ్ఐఆర్ ప్రధాన మంత్రి (పట్టణ) ఇళ్ల పథకం కోసమంటూ నకిలీ దరఖాస్తులను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదైంది. ఇళ్ల నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. -
సొంత వాహనాలను బాడుగకు తిప్పితే..
నగరంపాలెం: సొంత నెంబరు ప్లేటు కలిగిన వాహనాలను బాడుగకు తిప్పితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ జీసీ రాజరత్నం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలోని అనేక కార్లు, ఇన్నోవాలు, టవేరాలు, స్కార్పియో తదితర వాహనాలను సొంత నంబరు ప్లేటుతో (వ్యక్తిగత) వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని బాడుగకు తిప్పుతున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అలాంటి వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 286 వాహనాలపై కేసులు నమోదుచేసి రూ.3.92 లక్షల అపరాధ రుసుం వసూలు చేశామన్నారు. జిల్లాలోని అధికారులు తమ సిబ్బంది వ్యక్తిగత వాహనాలను అద్దె వాహనాలుగా వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సొంత వాహనాలను అద్దె వాహనాలుగా తిప్పుతున్నట్టు సమాచారం తెలిస్తే ఆర్టీఏ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. తనిఖీలు నిరంతరం జరుగుతుంటాయని తనిఖీలో పట్టుబడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డీటీసీ రాజరత్నం హెచ్చరించారు. -
అద్దె చట్టంలో ‘భారీ’ మినహాయింపు
ముంబై: ఇంకా అమలులోకి రాని రెంట్ యాక్ట్ (అద్దె చట్టం)లో భారీ వాణిజ్య, నివాస సముదాయాలకు మినహాయింపు ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. భూ యజమాని మార్కెట్ రేటు ప్రకారం అద్దె వసూలు చేయకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ విషయంపై ఓ హౌసింగ్ శాఖ అధికారి మాట్లాడుతూ.. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతా, గృహ నిర్మాణ ప్రధాన కార్యదర్శి సతీష్ గవయ్కి మధ్య అంతర్గత విభేదాలున్నాయన్నారు. దీంతో చట్టం చేసే సమయంలో మంత్రికి ఏవిధమైన సమాచారం అందించలేదని చెప్పారు. ప్రస్తుత అద్దె చట్టం గురించి మంత్రికి వివరించలేదన్నారు. 1996 మే 1 నుంచి సుప్రీంకోర్టులో ఈ విషయమై కేసు నడుస్తోందని, 16 మంది న్యాయమూర్తులు ఈ కేసును విచారిస్తున్నారని, కోర్టులో కేసు పరిష్కారమయ్యే వరకు చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. నిబంధనలివే..! 500 చదరపు అడుగుల కన్నా ఎక్కువ వైశాల్యం ఉన్న వాణిజ్య సముదాయాలు, 862 చదరపు అడుగుల కన్నా ఎక్కువ వైశాల్యం ఉన్న గృహ సముదాయాలు ఈ చట్టం పరిధిలోకి రావు. అయితే 46.5 చదరపు అడుగులు ఉన్న వాణిజ్య సముదాయాలు, 80 చదరపు అడుగులు ఉన్న గృహ సముదాయాల్లో రేట్ మాన్యువల్‌లో ఉన్న ప్రకారం చెల్లించి ఆ అద్దె ప్రాంతాన్ని వాడుకోవచ్చు. యజమాని అకస్మాత్తుగా అద్దె పెంచకుండా చట్టంలో నిబంధన పొందుపరిచారు. ఆ ప్రకారం మొదటి మూడుళ్లు ఇల్లు అద్దెకు తీసుకున్న వ్యక్తి మార్కెట్ రేటు ప్రకారం అద్దె 50 శాతం చెల్లిస్తాడు. నాలుగో ఏడాది నుంచి 100 శాతం అద్దె చెల్లిస్తాడు. అద్దెదారుని వార్షిక ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ అద్దె వసూలు చేయకూడదు. అలగే సీనియర్ సిటిజన్లు వారి వార్షిక ఆదాయంలో 15 శాతం కానీ, మార్కెట్ ప్రకారం ఉన్న అద్దెలో 50 శాతంలో తక్కువ ఉన్న మొత్తాన్ని చెల్లిస్తారు.


