నేటి నుంచి రంజీ పోరు
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ కొత్త సీజన్లో హైదరాబాద్, ఆంధ్ర జట్లు కీలక మ్యాచ్కు సిద్ధమయ్యాయి. గ్రూప్ ‘బి’లో భాగంగా నేటి నుంచి మూలపాడు (విజయవాడ) మైదానంలో జరిగే పోరులో ఇరు జట్లు తలపడతాయి. హైదరాబాద్ తమ తొలి మ్యాచ్లో ఇన్నింగ్స్, 40 పరుగుల తేడాతో చిన్న జట్టు త్రిపురను చిత్తు చేయగా... పటిష్టమైన కర్నాటకతో జరిగిన తమ మ్యాచ్ను ‘డ్రా’గా ముగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించింది. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. న్యూజిలాండ్ పర్యటనకు ముందు మరో రంజీ మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరిస్తున్న మొహమ్మద్ సిరాజ్ తన జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాలని పట్టుదలగా ఉన్నాడు.
త్రిపుర బలహీన జట్టు కావడంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 294 పరుగుల స్కోరు కూడా విజయానికి సరిపోయింది. ఒక్క సెంచరీ కూడా లేకపోగా, ఇద్దరే అర్ధ సెంచరీలు సాధించారు. అయితే బౌలింగ్ పదునుతో జట్టు మ్యాచ్ నెగ్గింది. గత మ్యాచ్లో కర్నాటకపై 418 పరుగుల భారీ స్కోరుతో సత్తా చాటిన ఆంధ్ర ఇప్పుడు సొంతగడ్డపై తొలి విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు న్యూ చండీగఢ్లో ఛత్తీస్గఢ్తో జరిగే మ్యాచ్లో భారత టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ పంజాబ్ తరఫున బరిలోకి దిగడం ఖాయమైంది.


