
మనసుకు నచ్చిన పనిచేస్తే అందులో కలిగే తృప్తి, ఆనందం వేరు అంటున్నారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సర్కిల్ ఆల్విన్ కాలనీ సాయినగర్‌లో శ్రీ రాజేశ్వరి వృద్ధాశ్రమ నిర్వాహకురాలు. చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహను అలవాటు చేసిన తండ్రి స్ఫూర్తితో 2012లో ఈ వృద్ధాశ్రమాన్ని నెలకొల్పారు.
అప్పటి నుంచి అనేక మంది అభాగ్యులను చేరదీసి వారికి అండగా నిలుస్తున్నారు. ఈ వృద్ధాశ్రమంలో ప్రస్తుతం 65 మంది వృద్ధులను ఆదరిస్తున్నారు. వారినే తన తల్లిదండ్రులుగా భావిస్తూ నిరంతరం సేవలందిస్తున్నారు. జీహెచ్‌ఎంసీవారు, పోలీసు వారు తప్పిపోయిన అనాథలను తీసుకొచ్చి రాజేశ్వరి వృద్ధాశ్రమంలో చేర్పిస్తుంటారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో..
వృద్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో.. వృద్ధాశ్రమంలో పక్షులు, బాతులు, చిలుకలు, పచ్చదనం కోసం వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేశారు. నిత్యం ఆశ్రమ పరిసరాలను శానిటేషన్ చేయిస్తూ శుభ్రతను పాటిస్తుంటారు. పలు ఆస్పత్రుల నిర్వాహకులతో చర్చించి వైద్యు పరీక్షలు చేయిస్తుంటారు. వృద్ధులకు కాలక్షేపానికి కథలు చెబుతూ ఆట పాటలు నిర్వహిస్తుంటారు.
సేవే లక్ష్యం.. ప్రేమే మార్గం అంటూ అనాథలకు అండగా నిలుస్తూ.. తండ్రి స్ఫూర్తితో వృద్ధులను ఆదుకుంటున్నారు.. వృద్ధాశ్రమ నిర్వాహకురాలు రాజేశ్వరి. ఎందరో అభాగ్యులను చేరదీసి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. నెల్లూరు జిల్లా తిమ్మారెడ్డి వాగు గ్రామంలో జన్మించి ఉన్నత చదువులు అభ్యసించినప్పటికీ సామాజిక స్పృహతో సమాజానికి తనవంతు సేవ చేస్తున్నారు.
దివ్యాంగులకూ అండగా..
కూకట్‌పల్లి, బోయిన్‌పల్లిలోని ఆశ్రమాల్లో గత ఐదేళ్లుగా వయో వృద్ధులతో పాటు దివ్యాంగులైన మూగ, చెవిటి వారికి కూడా ఆశ్రయం కలి్పంచి ఉచితంగా సేవలు అందిస్తున్నారు.
సేవే మహా భాగ్యంగా..
నా చివరి మజిలీ వరకూ మాతృమూర్తులకు సేవ చేస్తూనే ఉంటా. ఆశ్రమానికి పలువురు దాతలు అందించే చేయూత ఎప్పటికీ మరువలేను. వారి సహకారంతోనే నా లక్ష్యాన్ని కొనసాగిస్తున్నాను. కష్టంలోనూ వయో వృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా. వారి ఆనందమే నా ఆనందం. – రాజేశ్వరి, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు
(చదవండి: World Rivers Day: హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే.)