తెలంగాణలో దీర్ఘకాలిక రుగ్మతలు (NCDs) రెండు వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయోవృద్ధుల్లోనే కాకుండా, ఇప్పుడిప్పుడే యువతలోనూ ఇవే వ్యాధులు వేగంగా పెరుగుతున్నట్టుగా తాజా అధ్యయనాలు చూపిస్తున్నాయని డా. జీషాన్ అలీ తెలిపారు.
హైదరాబాద్లో తాజా సర్వే వివరాల ప్రకారం:
60 ఏళ్లు దాటినవారిలో దాదాపు సగం మంది రక్తపోటుతో బాధపడుతున్నారు
నలుగురిలో ఒకరికి డయాబెటిస్తో బాధపడుతున్నారు
సుమారు 44% శాతం మందికి ఊబకాయం సమస్య
ఇలా డయాబెటిస్, బీపీతో 30 నుంచి 40 ఏళ్ల పాటు జీవించడం ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. పెద్దవారు సులభంగా తట్టుకునే కొన్ని మందులు, చిన్న వయసు నుంచే ప్రారంభిస్తే.. పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యువతలో పెరుగుతున్న జీవనశైలి రుగ్మతలు
గతంలో 50 నుంచి 60 ఏళ్ల తర్వాత కనిపించే జీవనశైలి వ్యాధులు డయాబెటిస్, హైపర్టెన్షన్, హార్ట్ సమస్యలు ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్లకే నిర్ధారణ అవుతున్నాయని వైద్యులు తెలిపారు. చిన్న వయసులోనే ఈ రుగ్మతలతో 30–40 ఏళ్లు జీవించడం భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం
హైదరాబాద్ ప్రజల ఆహారపు అలవాట్లలో అధిక కొవ్వు, తక్కువ ఫైబర్ ఉండటం, పైగా రోజురోజుకూ పెరుగుతున్న కూర్చునే జీవనశైలి ఇవే యువతలోనే దీర్ఘకాలిక రుగ్మతలు వేగంగా పెరగడానికి కారణం అఅని అమెరికాలోని Physicians Committee for Responsible Medicine (PCRM)కు చెందిన పోషకాహార నిపుణుడు డా. జీషాన్ అలీ తెలిపారు.
ఇటీవల ఎం. ఎన్. ఆర్. మెడికల్ కాలేజీలో జరిగిన హెల్త్ సైన్స్ కార్యక్రమంలో మెడికల్ విద్యార్థులతో డాక్టర్ జీషాన్ అలీ మాట్లాడుతూ.. తృణ ధాన్యాలు, కూరగాయలు, పండ్లపై ఆధారపడిన ప్లాంట్-బేస్డ్ ఆహారం భుజించడం, జీవనశైలిలో మార్పులు తదితరాలు మెటాబాలిక్ రిస్క్‌లను గణనీయంగా తగ్గించగలదని పేర్కొన్నారు. అంతేగాదు ఇటీవల 48 మంది హృదయ రోగులపై నిర్వహించిన ఐదేళ్ల అధ్యయన వివరాలను కూడా వెల్లడించారు.
తక్కువ కొవ్వు ఉన్న శాకాహారాన్ని పాటిస్తూ, తేలికపాటి కార్డియో వ్యాయామం చేసిన వారిలో రక్తనాళాల ఇరుకుదనం స్పష్టంగా తగ్గిందని చెప్పారు. మొదటి ఏడాదిలో 1.75 శాతం మెరుగుదల కనిపించగా, ఐదేళ్లకు ఇది 3.1 శాతానికి చేరిందన్నారు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పులు చేయకుండా కేవలం సాధారణ వైద్య చికిత్స మాత్రమే తీసుకున్న రోగుల్లో వ్యాధి మరింతగా పెరిగినట్టు అధ్యయనం వెల్లడించిందని తెలిపారు.
(చదవండి: కొత్తిమీర పంటతో జస్ట్ 30 రోజుల్లోనే రూ.లక్ష లాభం!.. శెభాష్)


