సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్జాగుడా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన నక్షత్ర అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ ఇక్ఫాయి యూనివర్సిటీ విద్యార్థలు శ్రీ నిఖిల్,సూర్యతేజ,సుమిత్,రోహిత్,నక్షత్ర కోకాపేటలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం, ఓ స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగి నగరానికి వస్తుండగా ఘోరం జరిగింది. మితిమీరిన వేగంతో మీర్జాగుడా వద్ద ఢీవైడర్‌ను ఢీకొట్టింది. వేగం ఎక్కువగా ఉండటంతో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.
దీంతో కారు బోల్తా పడి నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. నక్షత్ర అనే యువతికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు యువతిని అత్యవసర చికిత్స ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.


