మానవత్వం
‘ధనానికి పేదను కావచ్చుగానీ గుణానికి కాదు’ అన్నట్లుగా ఉంటుంది కొందరి ధోరణి. వారి గుణంలోనే దానగుణం ఉంటుంది. అలాంటి ఒక మహిళ ఆత్రం లేతుబాయి.
ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం సహేజ్ గ్రామానికి చెందిన లేతుబాయి తనకు ఉన్న మూడెకరాల స్థలంలో ఒక ఎకరం స్థలాన్ని పది కోలాం కుటుంబాలు ఇళ్లు కట్టుకోడానికి ప్రభుత్వానికి దానంగా ఇచ్చింది...
ఆత్రం లేతుబాయి... అడవులను, చెట్టుపుట్టలనూ నమ్ముకొని జీవిస్తోంది. వ్యవసాయమే జీవనాధారంగా అతిసాధారణ జీవితాన్ని గడుపుతోంది. బాహ్య ప్రపంచం, ఆధునిక పోకడలు అస్సలు తెలియని అలాంటి మహిళపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కారణం... దుబ్బగూడ గ్రామంలో పది కొలాం కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. స్థలం లేకపోయినప్పటికీ ప్రత్యేక నిబంధనలతో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది. మంజూరైతే చేశారు గానీ ఆ ఇండ్లను కట్టేందుకు స్థలం అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో ఆత్రం లేతుబాయి తన భర్త జంగు, ముగ్గురు కుమారులతో చర్చించింది. తన పేరిట ఉన్న మూడెకరాల నుంచి ఒక ఎకరం ప్రభుత్వానికి అందజేసింది.
లేతుబాయి గతంలో కూడా ఇలానే తమ బంధువులు కొంతమందికి పూరిగుడిసెలు వేసుకునేందుకు చోటు కల్పించింది. ‘మా కొలాం కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నాయి. పక్కా ఇల్లు అనేది మాకు కల లాంటిది. అది నిజమైతే మా జీవితాలు మారుతాయి. అందుకే మాకు ఉన్న మూడు ఎకరాల్లో ఒక ఎకరం ఇచ్చాను’ అంటుంది 56 సంవత్సరాల లేతుబాయి. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా లేతుబాయి–జంగు దంపతులను ఘనంగా సన్మానించారు. లేతుబాయి నిర్ణయం ఎందరికో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.
– గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్,
ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి


