సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు.. అసెంబ్లీని ముట్టడించారు. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ రైతులు మాట్లాడుతూ..‘అధిక వర్షపాతం కారణంగా సోయాబీన్ పంట నష్టం జరిగింది. రంగు మారిందని సోయాబీన్ పంట కొనుగోలు చేయడం లేదు. పార్టీలకు అతీతంగా రైతు నాయకులు, రైతులు అందరం.. మంత్రిని కలవడానికి వచ్చాం. కేవలం ఐదుగురు రైతులను మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. వచ్చిన రైతులందరినీ పంపిస్తేనే లోపలికి వెళ్తాం అని చెప్పుకొచ్చారు. అయితే, పోలీసులు రైతులను లోపలికి అనుమతించకపోవడంతో వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు.

కాగా, రైతుల వద్ద నిలువ ఉన్న సోయాబీన్ పంటను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతుల వద్ద నుంచి 2,80,000 క్వింటాళ్లకు పైగా సోయాబీన్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లాలో ఈ ఏడాది.. 24,000 మంది రైతులు 72 ఎకరాలలో సోయాబీన్ సాగు చేశారు. 4,32,000 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా కానీ అంతకంటే ఎక్కువే వచ్చింది. ఇప్పటి వరకు 6280 మంది రైతుల వద్ద 1,64,000 క్వింటళ్ల పంటను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో, రైతులు ఆందోళనకు దిగారు.


