మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. చిత్రంలో జూపల్లి తదితరులు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం చర్యలు
ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ సర్వే చేయిస్తున్నాం
ఆదిలాబాద్‌టౌన్/ఆదిలాబాద్: డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో రూ.23 కోట్లతో నిర్మించిన క్రిటికల్‌కేర్ బ్లాక్‌ను శుక్రవారం ఆయన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలా బాద్–ఆర్మూర్ రైల్వే లైన్ కోసం చాలా రోజుల నుంచి డిమా ండ్ ఉందని, దీనికోసం సర్వే చేయిస్తున్నామని తెలిపారు.
అన్ని జిల్లా కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు, ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఉండాలన్నది కేంద్రం లక్ష్యమని, ఈ అంశంపై ప్రధానమంత్రి మోదీ దృష్టి పెట్టారని చెప్పారు. వైద్యుల కొరత తీర్చేందుకు కేంద్రం తగుచర్యలు చేపడుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పేరిట కేంద్రం రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తుందన్నారు. కాగా, రంగు మారిన సోయా పంటను కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. మార్చి వరకు సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేస్తామన్నారు. గతంలో ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వస్తే గత సీఎం ప్రధానిని కలిసే ఆలోచన చేయలేదన్నారు. అలాంటి రాజకీయాలు మంచివి కాదన్నారు. ఈ కార్య క్రమంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీలు దండే విఠ ల్, కొమురయ్య, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాద వ్, వెడ్మ బొజ్జు, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పాల్గొన్నారు.
అవినీతి రహిత పాలనతో ప్రగతికి బాటలు..
బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లకు ఆదిలాబాద్‌లో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, అవినీతి రహిత పాలనతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధికి పాటు పడుతోందన్నారు. 15వ ఆర్థిక కమిషన్, ఉపాధిహామీ నిధులు.. వంటి వాటితో ప్రగతికి బాటలు వేస్తోందని చెప్పారు. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులను దాచు కుంటోందని దుయ్యబట్టారు. నిధులను మళ్లించి, పల్లెల ప్రగతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ మరింతగా దివాలా తీయిస్తోందన్నారు.


