హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే.. | World Rivers Day Millions of people in more than 100 Countries Participate | Sakshi
Sakshi News home page

World Rivers Day: హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే..

Sep 28 2025 11:24 AM | Updated on Sep 28 2025 11:24 AM

World Rivers Day Millions of people in more than 100 Countries Participate

కొన్నిసార్లు సైన్స్‌ కన్నా, కవిత్వమే ఎక్కువ లాజికల్‌గా అనిపిస్తుంది! అందుకు ఒక ఉదాహరణ... బహుముఖసృజనశీలి అయిన ఇటాలియన్‌ చిత్రకారుడు, ఇంజినీరు లియోనార్డో డా విన్సీ నదుల్ని మానవ శరీరంలోని ధమనులు, సిరలతో పోల్చటం! నదులు, ఉపనదులు భూగోళానికిజీవ ప్రవాహ నాళాలు అని వాటి ప్రాముఖ్యాన్ని ఈ ఒక్కమాటతోచక్కగా అర్థం చేయించారు డా విన్సీ. 51 కోట్ల, 72 వేల చ.కి. మీ. విస్తీర్ణంలో ఉన్న మన భూమిపై లక్షన్నరకు పైగా నదులు ఉన్నాయని ఒకఅంచనా. ఈ నదుల ప్రాముఖ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేందుకని గత ఇరవై ఏళ్లుగా ఏటా మనం సెప్టెంబరు నాల్గవ ఆదివారాన్ని (నేడు)‘ప్రపంచనదుల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పురాణాల్లో, సాహిత్యంలో, సినీ గీతాల్లో ఉన్న నదుల మననాలు కొన్ని.. మీ కోసం! 

ప్రవాహమే నది రూపం
నదుల గురించి అల మాత్రంగానైనా మాట్లాడుకోవటం అంటే మహా సముద్రంలో ఈత కొట్టటమే! మొదలు–తుది; అంతము– ఆరంభమూ లేని ప్రవాహం... సమస్త మానవాళి జీవితాన్ని పెనవేసుకుని ఉన్న ఈ నదీ ప్రస్థానం. గ్రీకు తత్వవేత్త హెరాహ్లిటస్‌ అన్న మాట ఈ నదీ ప్రస్థానానికి, నదీ ప్రస్తావనకు చక్కగా సరిపోతుంది. ‘‘ఒకే మనిషి ఒకే నదిలో రెండోసారి అడుగు పెట్టడు. ఎందుకంటే– ఆ నది ఒకేలా ఉండదు. ఆ మనిషీ ఒకేలా ఉండడు’’ అంటారాయన. అంటే ప్రవాహం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనిషి కూడా నదీ ప్రవాహంలా ఒకేలా ఉండడు అని అంతరార్థం.

సాగిపోయే జీవిత నౌక
నదుల పోలికతో పాశ్చాత్యులవే మరికొన్ని అద్భుతమైన జీవిత సత్యాలు ఉన్నాయి. లెబనీస్‌–అమెరికన్‌ కవి ఖలీల్‌ జిబ్రాన్‌ ఏమంటారో చూడండి, ‘‘నది వెళ్లి సముద్రంలో కలిసినట్లే జననం వెళ్లి మరణంలో కలుస్తుంద’’ట! ఇక దివంగత బ్రిటన్‌ రాజనీతిజ్ఞుడు ఎనోచ్‌ పావెల్, ‘‘నా ఓడ కనిపించకుండాపోతే, నా ప్రయాణం ముగిసిందని కాదు. 

నది వంపు తిరిగిందని..’’ అని అంటారు! ఎంత చక్కగా చెప్పారు. ‘కొండగాలి తిరిగింది’ అని ఆరుద్ర అన్నట్లు – కొండగాలి మాత్రమే కాదు, నది కూడా తిరుగుతుంది. ప్రాప్తమున్న తీరానికి జీవిత నౌక సాగిపోతుంది. ఇదీ ఆరుద్ర మాటే. 

వయ్యారి గోదారమ్మ..!
ఒక అమ్మాయికి యుక్త వయస్సు అనేది విశాలమైన నది నుండి సముద్రంలోకి తేలుతున్నట్లుగా ఉంటుంది అంటారు జి.స్టాన్లీ హాల్‌. 19వ శతాబ్దపు మనో వైజ్ఞానిక నిపుణుడు ఈయన. నదిలా నూత్న యవ్వనం పరవళ్లు తొక్కుతుందని చెప్పటం స్టాన్లీ ఉద్దేశం. ‘వయ్యారి గోదారమ్మ ఒళ్లంత ఎందుకమ్మ కలవరం..’ అని వేటూరి అడిగిన ప్రశ్నకు స్టాన్లీ ఆల్రెడీ సమాధానం చెప్పేసే ఉంచారన్న మాట! అమెరికన్‌ సంగీతకారుడు జాన్‌ విలియమ్స్, నదిని సంగీతంలో పోల్చారు. 

‘‘సంగీతంలో నేను ఎక్కువ తక్కువల్ని చూడను. సంగీతం అన్నది మనమందరం కప్పులతో ముంచుకుని తాగ గల అమృతవాహిని అయిన నది’’ అన్నారు విలియమ్స్‌. ఇళయ రాజా దృష్టిలో సంగీతం అంటే ఏ ఉద్దేశమూ లేనిది! ‘‘నది ప్రవాహంలా సంగీతం సహజంగా, ఉద్దేశరహితంగా ఉండాలి’’ అంటారు ఇళయరాజా.

స్వర్గలోక వెండి ప్రవాహం
ప్రాచీన కాలపు చైనా దేశీయులు పాలపుంతను కూడా ఒక ప్రకాశవంతమైన నదిగానే ఊహించారు. ఆ నదిని స్వర్గంగా, ఆ ప్రవాహాన్ని వెండిగా భావించారు. బౌద్ధ దార్శనికుడైన ఆచార్య నాగార్జునుడు మానవ జీవితంలోని దుఃఖం గురించి మాట్లాడుతూ, ‘‘నదిలో కలిసి, కదిలే చెక్క దుంగలు ప్రతి అల చేత విడిపోతాయి. అనివార్యంగా అలా వేరు అవటం దుఃఖానికి కారణం కాకూడదు’’ అంటారు. 

ప్రసిద్ధ బ్రెజిల్‌ నవలా రచయిత పాలో కోయెలో మరికాస్త లోతుకు వెళ్లి, ‘‘మీరు నదిలో పడటం వల్ల మునిగిపోరు, కానీ దానిలో మునిగిపోవటం వల్ల మునిగిపోతారు’’ అంటారు. జీవితాన్ని భయంతో ఈదలేమని చెప్పటం కావచ్చు. ఇంగ్లిష్‌ నటి జూలీ ఆండ్రుస్‌ (89)కు నది వాసన అంటే ఇష్టం. నది సౌమ్యత ఇష్టం. ఆమె చిన్నతనం అంతా నదితోనే గడిచింది. నది ఆమెను ప్రశాంతపరచింది. ఆమెకు ఓదార్పునిచ్చింది. ఈ విషయాన్ని జూలీ అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. 

గంగా తీరాన రిషికేశ్‌
హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌కు భారతదేశంలోని సాయంత్రాలు అంటే చాలా ఇష్టమట. ఎందుకు ఇష్టమో ఆయన మాటల్లోనే విందాం. ‘‘సూర్యుడు ప్రపంచం అంచుకు చేరుకుంటాడు. శబ్దాలు అస్తమిస్తుంటాయి. పది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సైకిళ్లపై నదీ ప్రవాహంలా ఇంటికి చేరుకుని, శ్రీకృష్ణుడి గురించి, జీవన వ్యయం గురించి ఆలోచిస్తూ ఉండే మాయా క్షణాలవి’’ అంటాడు కామెరాన్‌. సైకిళ్లపై ఒక ఒరవడిగా వెళ్లే శ్రామికులను ఆయన ఒక నదీ ప్రవాహంగా ఊహించుకున్నారు. 

మైకేల్‌ ఎడ్వర్డ్‌ లవ్‌ కూడా భారతదేశం గురించి గొప్పగా చెప్పారు. ఆ గొప్పకు కారణం గంగా నది. మైకేల్‌ అమెరికన్‌ సింగర్, సాంగ్‌రైటర్‌. ‘‘1968 వసంతకాలంలో, ‘ది బీటిల్స్‌’ బ్యాండ్‌కు, నాకు మహర్షి మహేష్‌ యోగి నుండి భారతదేశంలోని రిషికేశ్‌కు రమ్మని ఆహ్వానం అందింది. రిషికేశ్‌ అనేక సంవత్సరాలుగా లక్షలాది మందికి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది హిమాలయాల నుండి గంగా నది ప్రవహించే ప్రదేశంలో ఉంది. ఆ వాతావరణంలో ఉండటం చాలా ప్రత్యేకమైనది’’ అంటారు మైకేల్‌. 

పురుష నది.. బ్రహ్మపుత్ర!
భారతీయ పురాణాలలో అనేక నదులు ప్రవహించాయి. అయితే అవి కేవలం భౌతిక ప్రవాహాలు కావు. దైవత్వం పొందినవి. దేవతలతో సమానంగా గౌరవాన్ని పొందినవి. పూజలను అందుకున్నవి. గంగా, యమునా, సరస్వతి, గోదావరి నదులను స్త్రీ దేవతలుగా పూజిస్తారు. ఆ పవిత్ర జలాలలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరి పురుష నదులే లేవా? లేనట్లున్నాయి. బ్రహ్మపుత్ర నదిని మాత్రం ‘పురుష నది’గా పరిగణిస్తారు. మన నదులన్నీ కూడా రుగ్వేదం, మహాభారతం, రామాయణం వంటి పురాణ, ఇతిహాసాలలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయి. 

‘గంగావతరణ’ ఘట్టం
దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిందీ, శ్రీరాముడి అవతార పరిసమాప్తి అయిందీ ‘సరయూ’ సమీపంలోనే. రామాయణంలోని ‘గంగావతరణ’ ఘట్టం అయితే ఒక అద్భుతమైన చిత్రణ. సీతను వెదకి రమ్మని వానరులను పంపేటప్పుడు ఆమెను ఎక్కడెక్కడ వెతకాలో చెబుతూ శరావతి, కావేరి, తామ్రపర్ణి, నర్మద, కౌశికీ, యమునా నదులను ప్రస్తావిస్తాడు సుగ్రీవుడు. ఇక కవుల గురించి చెప్పక్కర్లేదు. నది ఊసు లేనిదే వారి కలాలు పరవళ్లు తొక్కవు. ‘కవుల కవిత్వంలో పొంగిన నదులు’ అంటూ రాజన్‌ పి.టి.ఎస్‌.కె. అనే రచయిత తెలుగులో ఒక పుస్తకమే రాశారు. 

కృష్ణవేణి.. విరిబోణి.. అలివేణి
నది పేరుతో అనేక తెలుగు నవలలు, కథలు వచ్చాయి. అదొక అంతే లేని జాబితా. అలాగే తెలుగు సినిమా పాటలు వందలు, వేలు! పూర్తిగా ఒక నదిపైనే వచ్చిన పాట మాత్రం బహుశా డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి రాసిన ‘కృష్ణవేణి తెలుగింటి విరిబోణి / కృష్ణవేణి నా ఇంటి అలివేణి’ కావచ్చు. ఆ పాటలో కృష్ణానది విశేషాలన్నిటినీ సినారె పొందుపర1చారు. భక్తిగీతంలా మొదలై పరవళ్లు తొక్కుతూ వెళ్లి సాగర హృదయాన సంగమిస్తుంది. ఈ పాట ‘కృష్ణవేణి’ (1974) చిత్రం లోనిది.

వేదంలా ఘోషించే గోదావరి
కృష్ణవేణికి దీటైన ఇంకో తెలుగు సినిమా పాట.. ‘వేదంలా ఘోషించే గోదావరి.. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి’. 1983 నాటి ‘ఆంధ్ర కేసరి’ సినిమా కోసం ఆరుద్ర ఈ పాటను రాశారు. అయితే ఆ పాట పూర్తిగా గోదావరి విశేషాల మీద కాకుండా, గోదావరికి అనుసంధానమై ఉన్న సుందర నగరాలు, కవులు–కావ్యాలు, ఏలిన రాజులు మీద సాగుతుంది. 

గోదావరి మీదే వేటూరి గారు రాసిన పాట ‘గోదావరి’ చిత్రంలోని ‘ఉప్పొంగెలే గోదావరి’. ఇంకా.. ‘ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుందీ’ (ఆత్రేయ–‘చక్రవాకం’), ‘నవ్వుల నదిలో పువ్వుల పడవ’ (ఆరుద్ర–‘మర్మయోగి’), ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ’ (శేషేంద్ర శర్మ–‘ముత్యాల ముగ్గు’) ‘చినుకులా రాలి.. నదులుగా సాగి’ (వేటూరి–నాలుగు స్తంభాలాట), ‘గోదారి గట్టుంది.. గట్టు మీద సెట్టుంది..’ (దాశరథి కృష్ణమాచార్య–‘మూగ మనసులు’)... వంటి పాటలు పూర్తిగా నది చుట్టూ తిరిగినవి కాకపోయినా, దోసెడు నది నీళ్లను పట్టి ప్రేక్షకుల తలపులపై చిలకరించినవి. నదులపై మంచి మంచి సినిమా పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి కొన్ని రేణువులు మాత్రమే.  నదులు కేవలం నీళ్లు కాదు, కేవలం ప్రవాహాలు కాదు, కేవలం ప్రయాణ మార్గాలు అంతకన్నా కాదు. మనిషిని బతికించే సంజీవినులు మాత్రమే కాదు. డా విన్సీ అన్నట్లు – భూగోళానికే జీవాన్ని, చేవను ఇచ్చే సిరలు, ధమనులు.

శ్రీశ్రీ అనుసంధానం!
‘మరో ప్రపంచం’ (1970) సినిమాలో శ్రీశ్రీ ‘అణగారిన బ్రతుకులలో..’ అనే పాట రాశారు. అందులోని ఒక చరణంలో... ‘గంగా, కావేరీ – నదులను కలుపుదాం..’ అన్నారు ఆయన. ఆ చరణం ఇలా ఉంటుంది : ‘ఈ దేశం నీదీ నాదని / ఇది ఒక్కరికే సొంతం కాదని / గంగా, కావేరి నదులు కలుపుదాం / కలిపి, సరిహద్దు చెరిపి, చెలిమి నిలుపుదాం..’ అని. యాభై ఏళ్ల క్రితం తొలిసారి 1972లో అప్పటి కేంద్ర మంత్రి కె.ఎల్‌.రావు గంగ–కావేరి నదులను అనుసంధానించాలని ప్రతిపాదించారు. 

అంటే, శ్రీశ్రీ తన పాట ద్వారా అంతకు రెండేళ్లకు ముందే గంగ, కావేరీలను అనుసంధానించారు! అందుకే, సృజనశీలులను కాలజ్ఞానులు అని కూడా అంటారు. నదుల అనుసంధానం గురించి 1974లో కెప్టెన్‌ దిన్షా జె.దస్తూర్‌ మరో ప్రతిపాదన తెచ్చారు. హిమాలయ నదులైన గంగ, సింధు, బ్రహ్మపుత్రలను... ద్వీపకల్ప నదులైన గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, నర్మద, తపతి, పంబ వంటి వాటితో కలపొచ్చని! ఆ తర్వాత కేంద్ర జల వనరుల శాఖ ఇంకో ప్రతిపాదన తెచ్చింది. ఇవేవీ ఆచరణకు రాలేదు. 
సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement