ఇటీవలి కాలంలో చాలామందికి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం ఒక అలవాటుగా మారిందనేకన్నా వ్యసనంగా మారిందనడం కరెక్టేమో! ప్రతి చిన్న విషయాన్నీ వెంటనే స్టేటస్‌లో పెట్టేస్తున్నారు. ఒకోసారి అవి చాలా సిల్లీగా అనిపిస్తాయి. అయితే అలా చీటికి మాటికీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం కూడా మామూలు విషయం కాదనీ, దీని వెనక కొన్ని మానసిక కారణాలుంటాయనీ సైకాలజిస్టులు చెబుతున్నారు.
సోషల్ మీడియా పెరిగిన తర్వాత మనుషుల జీవితం పబ్లిక్‌గా మారింది. సంతోషం వచ్చినా, బాధ కలిగినా దాన్ని లోపలే ఉంచుకోలేరు. వెంటనే దానిని స్టేటస్‌గా పెట్టుకోవడమో ఫేస్‌బుక్‌లో పెట్టడమో చేస్తున్నారు. తమ భావోద్వేగాలన్నింటినీ ఇతరులు పంచుకుంటున్నారు అన్న భావనే వారికి ఊరట ఇస్తోంది. ఈ అలవాటు క్రమంగా అవసరంగా మారుతోంది.
‘ఉనికి’ పాట్లు
స్టేటస్‌కు వ్యూస్ వస్తున్నాయా, రిప్లై వచ్చిందా అన్నదే కొందరికి ముఖ్యంగా మారింది. ఇది ఒక విధమైన మానసిక ధోరణిగా నిపుణులు చెబుతున్నారు. వారి స్టేటస్‌ను చూసి ఎవరైనా స్పందిస్తే ‘నన్ను గమనిస్తున్నారు’ అన్న భావన వారికి సంతోషాన్నిస్తుంది.
సమస్యేం కాదు కానీ...
అప్పుడప్పుడు స్టేటస్ పెట్టడం సమస్య కాదు. కానీ ప్రతి భావాన్ని స్టేటస్ ద్వారానే చె΄్పాలి అన్న స్థితి వస్తే జాగ్రత్త అవసరం. నిజమైన సంభాషణ తగ్గి, వర్చువల్ స్పందనపై ఆధారపడటం మొదలైతే అది మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. సంతోషం, బాధ రెండింటికీ స్క్రీన్ మాత్రమే పరిష్కారం కాదు. కష్టసుఖాలలో తమకు తమకు తోడుగా ఉండే నిజమైన మనుషులే అసలైన పరిష్కారం అని గుర్తించాలి.
అసలు ఉద్దేశ్యం అదీ...
చాలా స్టేటస్‌లకు అసలు ఉద్దేశం అందరికీ చెప్పడం కాదు. తాము కోరుకునే ఒక ప్రత్యేక వ్యక్తి చూడాలి లేదా అర్థం చేసుకోవాలి అన్న కోరికే ప్రధాన కారణం. వారికి నేరుగా మెసేజ్ చేయలేక తమ ఫీలింగ్స్‌ను స్టేటస్ రూపంలో చెప్పే ప్రయత్నం ఇది. ఇది ‘ఇండైరెక్ట్ కమ్యూనికేషన్’ గా సైకాలజిస్టులు చెబుతున్నారు.


