
ప్రతీకాత్మక చిత్రం
ఇన్ బాక్స్
సీబీఎస్‌ఈ బోర్డు మే 14న విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నట్లు ఇతర రాష్ట్రాలతో పాటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళన్నిటిలో ‘షుగర్ బోర్డులు’ పెడుతున్నారు.
పంచదార అధిక మోతాదులో ఉన్న జంక్ ఫుడ్స్ తినడం వల్ల పిల్లలలో ఊబకాయం, మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరి గిన రీత్యా ఈ చర్య తీసుకున్నారు. ఇప్పటివరకు కొవ్వు ఆహారాల వల్లే జీవనశైలి (Life Style) వ్యాధులు వస్తున్నాయనీ, కొవ్వులు తగ్గించడమే సమస్యకు పరిష్కారమనీ తప్పుడు ప్రచారం తీవ్ర స్థాయిలో ఉంది. నిజానికి చక్కెర వాడకం అధికం కావడం వల్లే పిల్లలు రకరకాల రుగ్మతలకు గురవుతున్నారు. రోజువారీగా పిల్లలు తీసుకుంటున్న కేలరీలలో పంచదార (Sugar) నుండి వచ్చే కేలరీలు 5 శాతానికి మించకూడదు. మన పిల్లల ఆహారంలో 13 నుండి 15 శాతం (3 రెట్లు) కేలరీలు పంచదార నుండే వస్తున్నట్లు గుర్తించారు.
2010లో ఢిల్లీ హైకోర్టులో ‘ఉదయ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసి జంక్ ఫుడ్స్‌ను నిషేధించ మనడంతో ఈ చర్చ ప్రారంభమయ్యింది. 2015లో కోర్టు ఇందుకు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను రూపొందించమని వివిధ కేంద్ర పభుత్వ సంస్థలను ఆదేశించింది. 2013లోనే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి జంక్ ఫుడ్స్ అమ్మకాలను స్కూళ్ళలో నిషేధించమని అదే కోర్టు కోరింది. 2019లో తమిళనాడు ప్రభుత్వం జంక్‌ఫుడ్స్‌ను, కూల్‌డ్రింక్స్‌ను స్కూళ్ళలో నిషేధించింది. పంచదార దట్టించిన ఆహారాలు పిల్లలలో ఊబకాయం, మధుమేహాలనే గాక దంత క్షీణత, గుండె జబ్బులు, బీపీ, మతి మరుపు, మెదడు (Brain) పనితనం దెబ్బతినడం, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నట్లు అనేక పరిశోధనల్లో నిర్ధారణ అయింది.
ప్రభుత్వాలు ప్రమాదకరమైన ఈ ఆహారాల తయారీని కట్టడి చేయాలి/నిషేధించాలి. పోషకాహార అంశాల్ని స్కూల్ సిలబస్‌లో భాగం చేయాలి. ఆహారం వండే వర్కుషాపులు కనీసం వారానికొకటి పిల్లలచే చేయించాలి. మన శరీరాలకు బయో క్లాక్ వుంది. హార్మోన్లు విడుదలయ్యే క్రమానికి అనుగుణంగా ఆహార వేళలు, నిద్ర వేళలు (Sleeping Hours) ఉండాల్సిన అవసరాన్ని చెప్పడమే గాదు, అమలుపరచాలి. ప్రతిరోజూ ఆటలకు, వ్యాయామానికి తగిన సమయం స్కూల్ టైమ్ టేబుల్‌లో కేటాయించాలి.
చదవండి: మీ తియ్యని ప్రేమ తగ్గించండి!
ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్న వైద్యులుగా, పిల్లల సమగ్ర అభివృద్ధి పట్ల శ్రద్ధ ఉన్న వారిగా మేం ఈ విజ్ఞాపనను ముందు పెడుతున్నాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆరోగ్యకర పిల్లలతో కూడిన దేశ నిర్మాణం కోరే వారంతా మాతో గొంతు కలపాలని కోరుతున్నాం.
– వైద్యులు, పిల్లల ప్రేమికులు