
పిల్లలకు ఎక్కువ చక్కెర పెడుతున్న తల్లిదండ్రులు
ఫలితంగా బాల్యం నుంచే అనారోగ్య సమస్యలు
రోజుకు గరిష్ఠంగా 5 టీస్పూన్లకు మించరాదు
పిల్లలు అడిగినా, అడక్కపోయినా స్వీట్స్, చాకొలేట్స్ వారి చేతుల్లో పెడతాం. హోమ్‌వర్క్ త్వరగా చేస్తేనో, అల్లరి చేయకుండా ఉంటేనో, ఫలానా పని చేస్తేనే.. ఐస్‌క్రీమ్, కేక్ అంటూ ఆఫర్లు ఇస్తుంటాం. అంతేకాదు ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు స్వీట్స్, చాకొలేట్స్ తీసుకొచ్చి వద్దు అంటున్నా నోట్లో పెట్టి మరీ వారి ప్రేమను చూపిస్తుంటారు. ఇంతటి ‘తీపి’ ప్రేమ పిల్లల పాలిట శత్రువు అవుతోందనే విషయం చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. పిల్లల్లో చక్కెర వినియోగం పరిమితం చేయకపోతే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చక్కెర తింటే శక్తి వస్తుందన్నది పాత మాట. ఇప్పుడు అదే అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. పిల్లల్లో చక్కెర తీసుకోవడం పరిమితం చేయడం వల్ల వారికి మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని నేచర్ జర్నల్‌లో 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. చిన్నతనంలో చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల పిల్లలలో ఊబకాయం, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చక్కెర పానీయాలను అధికంగా సేవించడం వల్ల కడుపు ఉబ్బరం, కొన్ని సందర్భాల్లో పొట్టలో అసౌకర్యం కూడా సంభవిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహార పదార్థాల్లో సహజంగా లభించే చక్కెర కాకుండా అదనంగా పరిమితికి మించి చేర్చడం శ్రేయస్కరం కాదన్నది వారి మాట.
ఇంకాస్త తగ్గించండి..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సవరించిన మార్గదర్శకాల ప్రకారం రోజుకు శరీరానికి కావాల్సిన కేలరీల్లో చక్కెర నుంచి వచ్చేవి 5 శాతానికి మించరాదు. అంటే ప్రామాణిక 2,000 కిలో కేలరీల ఆహారంలో రోజుకు గరిష్ఠంగా అదనపు చక్కెర ఐదు టీస్పూన్లకు పరిమితం కావాలి. ఇది పిల్లలు, పెద్దలు ఇద్దరికీ వర్తిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
⇒ ఊబకాయం, మధుమేహం, దంత క్షయం ప్రమాదాన్ని తగ్గించడానికి పిల్లలు చక్కెర వినియోగాన్ని మరింత పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
⇒ రెండేళ్లకు పైబడిన పిల్లలకు అదనపు చక్కెర 2–4 టీస్పూన్లకు మించరాదని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.
⇒ రెండేళ్లలోపు పిల్లలకు అదనపు చక్కెర ఇవ్వకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ స్పష్టం చేశాయి.
బర్త్‌డే నాడు కేక్ చాలు
చాలామంది పిల్లలు రోజూ 20–25 టీస్పూన్ల చక్కెర తీసుకుంటున్నారని, ఇది వాళ్ల ఆరోగ్యానికి మంచిది కాదని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషన్స్ (ఐఏపీ) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇంట్లో వేడుకలు, విహారయాత్రల సమయంలో పిల్లలకు చక్కెర ఆధారిత ఆహారం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ‘పిల్లలకు నెలకు రెండు చిన్న స్కూప్‌లకు మించి ఐస్‌క్రీం ఇవ్వకూడదు. పుట్టినరోజు పార్టీల సందర్భంలో కూల్‌డ్రింకులు, చాక్లెట్లు, బిస్కెట్లు, కేకుల వంటివి అదుపు లేకుండా తింటుంటారు. ఇది మంచిది కాదు. కేక్ తింటారు కాబట్టి ఆ రోజంతా అదనపు చక్కెర ఉన్న ఆహారాన్ని పిల్లలకు ఇవ్వకూడదు ’ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
జాబితా పెద్దదే
పండ్లు, పాల వంటి పదార్థాలలో చక్కెర సహజంగా ఉంటుంది. పాలలో లాక్టోజ్, పండ్లలో ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో వస్తాయి. కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లేదా వంట సమయంలో అదనంగా చేర్చిన చక్కెర.. కేలరీలను అందించినప్పటికీ విటమిన్లు, ఖనిజాలు లేదా ఫైబర్ వంటి పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్యాక్ చేసిన జ్యూస్‌లు, ఇన్ స్టంట్ నూడుల్స్, బ్రెడ్, బిస్కెట్లు, సాస్‌లు వంటి చాలా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో, శిశువులకు ఇచ్చే తృణ ధాన్య ఉత్పత్తులు, యోగర్ట్, పోషక/శక్తి పానీయాలు వంటి వాటిలో కూడా అదనంగా చేర్చిన చక్కెర ఉంటోంది.
బడుల్లో షుగర్ బోర్డులు..
ఇటీవలి కాలంలో పిల్లల్లో మధుమేహం కేసులు పెరిగాయి. మరీ ముఖ్యంగా టైప్ 2 మధుమేహం.. ఇటీవల పిల్లల్లోనూ కనిపిస్తుండటంతో సీబీఎస్‌ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల్లో ‘షుగర్ బోర్డులు’ ఏర్పాటు చేస్తోంది. అతిగా చక్కెర తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై.. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. తద్వారా విద్యార్థుల చక్కెర వాడకాన్ని తగ్గించేందుకు వీలవుతుందని సీబీఎస్‌ఈ భావిస్తోంది.
ఆందోళన వ్యక్తం చేసిన సీబీఎస్‌ఈ..
విద్యార్థులు తీసుకోవాల్సిన దానికంటే దాదాపు మూడురెట్లు ఎక్కువగా చక్కెర తీసుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి అని సీబీఎస్‌ఈ ఆందోళన వ్యక్తం చేసింది. ‘4 నుంచి 10 ఏళ్ల వయసున్న పిల్లలు రోజూ చక్కెర నుంచి సగటున 13 శాతం కేలరీలు పొందుతున్నారు. 11 నుంచి 15 ఏళ్ల వయసు విద్యార్థుల్లో ఇది మరీ ఎక్కువగా 15 శాతం వరకు ఉంది. ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ఇది 5 శాతానికి మించి ఉండకూడదు’ అని సీబీఎస్‌ఈ తెలిపింది.