దాంపత్య జీవితంలో ప్రతీ జంటకు తల్లిదండ్రులవ్వడం అనేది ఓ వరం. అయితే రకరకాల సమస్యలతో ఆ ప్రయత్నంలో ఇబ్బందులు పడే వాళ్లున్నారు. మరీ ముఖ్యంగా డయాబెటిస్ పెషేంట్లలో ఇది అధికంగా ఉంటోందనే ప్రచారం ఒకటి ఉంది. డయాబెటిక్ మహిళా పేషెంట్లు అసలు గర్భమే ధరించలేరని తరచూ కొందరు చెబుతుండడమూ చూస్తుంటాం. మరి అందులో నిజమెంత?.. ఇలాంటి ప్రచారాలపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?.. ఓసారి పరిశీలిద్దాం..

ప్రచారం 1: డయాబెటీస్ ఉన్న మహిళలు సహజంగా గర్భం ధరించలేరు!!
వాస్తవం: డయాబెటిస్ సహజంగా గర్భం ధరించడాన్ని ఆపదు. షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకుంటూ.. ఆరోగ్యవంతమైన జీవనశైలి పాటిస్తూ చాలా మంది మహిళలు గర్భం దాల్చడమే కాదు.. ఆరోగ్యవంతమైన పిల్లల్నీ కనగలరు. షుగర్ నియంత్రణలో లేనప్పుడు మాత్రం అండం ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అప్పుడు గర్భం దాల్చడం కష్టతరమవుతుంది.
ప్రచారం2: డయాబెటీస్ మహిళల ఫెర్టిలిటీని మాత్రమే ప్రభావితం చేస్తుంది
వాస్తవం: మహిళలకు మాత్రమే కాదు.. పురుషులకూ ఇది వర్తిస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకపోతే పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పురుష హార్మోన్ (టెస్టోస్టిరాన్) లెవెల్స్ తగ్గుతుంది. స్పెర్మ్ నాణ్యతతో పాటు కౌంట్ కూడా తగ్గే ప్రమాదం ఉంది.
ప్రచారం 3: ఆ టైంలో మందులు వాడకూడదు!
వాస్తవం: గర్భధారణ ప్లాన్ చేస్తున్నప్పుడు షుగర్ పేషెంట్లు మందులు మావేస్తుంటారు. అలాంటి సమయంలో భాగస్వాములు ఆరోగ్యకరమైన గ్లూకోస్ లెవెల్స్ కలిగి ఉండడం అత్యంత అవసరం. అందుకే మధుమేహ మందులను అకస్మాత్తుగా ఆపడం సరైంది కాదు. రక్తంలో గ్లూకోజ్ సరైన మోతాదులో ఉంచుకునేందుకు.. కొన్ని మందులను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. అయితే అది కేవలం వైద్యుల సూచనలతోనే జరగాలి. సొంత వైద్యం అస్సలు మంచిది కాదు.

ప్రచారం 4: రక్తంలో అధిక గ్లూకోజ్ లెవల్స్‌తో ఏం కాదు
వాస్తవం: ఇది చాలా తప్పు. గర్భంతో ఉన్న టైంలో షుగర్ పేషెంట్ల షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. అది బీపీ పెరగడం, ప్రీఎక్లాంప్షియా సమస్యలకు దారితీయొచ్చు ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదకరంగానూ మారొచ్చు. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ నుంచే షుగర్ లెవల్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
ప్రచారం 5: డయాబెటిస్ ఉంటే ఫెర్టిలిటీ చికిత్సలు పనిచేయవు
వాస్తవం: డయాబెటిస్ పేషెంట్లు ఐవీఎఫ్, ఐసీఎస్ఐ లాంటి ఫెర్టిలిటీ చికిత్సల ద్వారా గర్భం దాల్చొచ్చు కూడా. డయాబెటిస్ ఉన్నదని ఈ చికిత్సలు పనిచేయవని భావించడం అపోహ మాత్రమే. అయితే ఈ చికిత్సలు విజయవంతంగా జరిగేందుకు బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండడం చాలా ముఖ్యం.
-డా. ప్రశాంత కుమార్ నాయక్, ఎంబీబీఎస్, ఎండీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. ఒయాసిస్ ఫెర్టిలిటీ


