World Television Day: చిత్రలహరి వస్తుంది పద... | History of Television in India, World Television Day special story | Sakshi
Sakshi News home page

World Television Day: చిత్రలహరి వస్తుంది పద...

Nov 21 2025 12:36 AM | Updated on Nov 21 2025 12:36 AM

History of Television in India, World Television Day special story

నేడు వరల్డ్‌ టెలివిజన్ డే

నోస్టాల్జియా

కొద్దిగా ఉన్నప్పుడే బాగుండేది. టీవీ ఉన్న ఇంటికి టీవీ లేని వాళ్లంతా వచ్చి కూచునేవారు. ఆదివారం రామాయణం కోసం ప్రతి ఇల్లూ ఆతిథ్యం ఇచ్చేది. చిత్రలహరికి గడప బయట నిలబడి తొంగి చూసే పిల్లల్ని అదిలించేవారు కాదు. ఇంటి పైన యాంటెనా, ఇంట్లో డయనారా అదీ హోదా అంటే. టెలివిజన్‌ జీవితంలో భాగం అయిన రోజులు బాగుండేవి. ఇవాళ జీవితమంతా టీవీగా మారి ఊపిరి సలపడం లేదు. టీవీ వచ్చిన రోజులకూ ఇప్పటికీ ఎంత తేడా!

సినిమా తెర మీద కాకుండా మరో తెర మీద, అదీ ఇంట్లో ఉండే తెర మీద బొమ్మ పడుతుందని ఊహించని రోజుల్లో టెలివిజన్‌ వచ్చి చేసిన సందడి అంతా ఇంతా కాదు. నాటి హైద్రాబాద్, లేదా మద్రాస్‌ (చెన్నై), లేదా కొండపల్లి నుంచి సిగ్నల్స్‌ సరిగా ఆ రోజుకి అందాయో ఇక పండగే పండగ. ఎందుకు పండగ? సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు ఆ తెలుపు నలుపు టీవీలో ఏదో ఒకటి ఉచితంగా ప్రసారం అవుతూ ఉంటుంది. చూడొచ్చు. అందుకని.

సమయం ఉన్న రోజులు
మన దేశంలో 1959లో టెలివిజన్‌ మొదలైనా సరైన ప్రసారాలు రూపుదిద్దుకోవడానికి 1976కి కాని సాధ్యపడలేదు. నగరాలను దాటి ఊళ్లకు సిగ్నల్‌ అందే వ్యవస్థ ఏర్పడటానికి మరో పదేళ్లు పట్టింది. కలర్‌ ప్రసారాలు 1982లో మొదలైనా 1990లకు గాని కలర్‌ టీవీలు కొనే శక్తి ఊళ్లల్లో ఏ కొద్దిమందికో తప్ప అందరికీ రాలేదు. ఏతా వాతా 1985 నుంచి తెలుపు, నలుపు టీవీ ప్రసారాలు తెలుగు ప్రేక్షకులకు తెలుస్తూ వచ్చాయి. 

ఆ రోజుల్లో మనుషులందరి దగ్గరా ఎక్కడ లేని తీరిక, సమయం. కాబట్టి టీవీ ఆన్‌ చేసి అర్థమైనా కాకపోయినా చూస్తూ ఉండటం అలవాటుగా మారింది. ఇక అందులో ఆసక్తికరమైన కార్యక్రమాలు మొదలయ్యాక అతుక్కుపోయారు. టెలివిజన్‌ చేసిన మొదటి పని ఏమిటంటే– దేశ వాసులందరికీ ఒకే టీవీ ఒకే వినోదం అనే భావన కలిగించడం. ప్రాంతీయ ప్రసారాలు ఉన్నా ముఖ్యమైన మీట ఢిల్లీలో ఉంటుందని అందరికీ తెలియచేయడం. కేంద్ర శక్తిని స్థాపించడంలో టెలివిజన్‌ ముఖ్య పాత్ర పోషించింది.

రామాయణం సంచలనం
1987 నుంచి మొదలైన ‘రామాయణం’ సీరియల్‌ టెలివిజన్‌ పవర్‌ ఏంటో దేశానికి చాటింది. వ్యాపార ప్రకటనలు ఎలక్ట్రానిక్‌ మీడియాలో వెల్లువెత్తడం కూడా మొదలయ్యాయి. అంతవరకూ టికెట్‌ ఇచ్చి సినిమా హాల్లో రామాయణం చూసిన జనం ఈ ఉచిత రామాయణాన్ని తండోపతండాలుగా చూశారు. ఆ తర్వాత ‘మహాభారత్‌’, ‘హమ్‌లోగ్‌’, ‘నుక్కడ్‌’, ‘ఉడాన్‌’, ‘మాల్గుడీ డేస్‌’... ప్రేక్షకులకు అందమైన డేస్‌ మిగిల్చాయి.

చిత్రహార్‌–చిత్రలహరి
ప్రతి బుధవారం వచ్చే హిందీ  పాటల ‘చిత్రహార్‌’, శుక్రవారం వచ్చే ‘చిత్రలహరి’ సూపర్‌హిట్‌ ఆదరణ పొందాయి. జనం తెలుగు  పాటల కోసం టీవీల ముందు కొలువు తీరేవారు. ఆ రోజుల్లో ప్రతివారం ‘ఒక బృందావనం సోయగం’ (ఘర్షణ 1988)  పాట తప్పనిసరిగా ఉండేది. పండగల ముందు ఆయా పండగలకు తగ్గట్టుగా  పాటలు ఉండేవి. అదే సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ‘ఆనందో బ్రహ్మ’ సూపర్‌హిట్‌ అయ్యింది. ఆదివారం రోజు అతి  పాత తెలుగు చిత్రం వచ్చినా జనం విరగబడి చూసేవారు.

అపురూప క్షణాలు
ఇంటి పైనా యాంటెనా, ఇంట్లో టీవీ ఉండటం ఎంతో గొప్పయిన రోజులు అవి. ఇక కలర్‌ టీవీ ఉన్న ఇంటికి డిమాండ్‌ జాస్తిగా ఉండేది. వాన వచ్చినా, గాలి వీచినా నిలువని బొమ్మతో వేగినా అదే పెద్ద సంబరం. ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొని ఇంటికి టీవీ తెచ్చిన రోజు పండగ ఉండేది. మధ్యతరగతి జీవులకు తగినట్టుగా ‘మినీ టీవీ’లు కంపెనీలు తెచ్చాక వాటితోనే సర్దుబాటు చేసుకున్న సన్నజీవులెందరో. 

దూరదర్శన్‌ సిగ్నేచర్‌ ట్యూన్‌తో సహా దూరదర్శన్‌ అందరికీ అభిమాన పాత్రమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా సబ్‌టైటిల్స్‌తో చూసేవారు. అలా ఎన్నో ఉత్తర కన్నడ, తమిళ, మలయాళ సినిమాలు చూశారు. టీవీ ప్రసారాల వల్ల ఇరుగిల్లు  పొరుగిల్లు ఒకే ఇల్లయినట్టుగా అందరూ కలిసి మెలిసి ఉండేవారు. టీవీలో క్రికెట్‌ లైవ్‌ చూడటానికి ఎంతో మంచిగా వ్యవహరించాల్సి వచ్చేది. స్నేహాలు చేయాల్సి వచ్చేది.

ఇప్పుడు చేతిలో ఫోన్‌. అనుక్షణం రీల్స్‌. చేతిలోనే కదిలే బొమ్మ. దేనికీ విలువ లేదు. ఓటీటీల్లో వందల సినిమాలు ఉన్నా దేనిని ఎంపిక చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఏదీ నచ్చదు. కానీ ఆ రోజుల్లో వచ్చిందే నచ్చేది. అతిగా లభ్యమైనది ఏదైనా విలువ కోల్పోతుంది. ఇవాళ విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేయి రూ పాలు సంతరించుకున్నా, ఇరవై నాలుగ్గంటల న్యూస్‌ చానల్స్‌ ఉన్నా అవన్నీ జల్లెడలో జారే ఊకలానే ఉంటున్నాయి. టెలివిజన్‌ ప్రసారాల ప్రొఫెషనలిజమ్, హుందాతనం, ఆ న్యూస్‌రీడర్లు, ఆ యాంకర్లు... ఆ మాట... ఉచ్చారణ... పలుకు... ఇప్పుడెక్కడ.  పసిడి రెక్కలు విసిరి కాలం  పారిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement