రాముని పాత్రకు రణవీర్ ఎంపికపైనా వ్యాఖ్యలు
ప్రస్తుతం మన దేశంలో అత్యంత పేరొందిన ఆధ్యాత్మిక గురువుగా సద్గురు జగ్గీ వాసుదేవ్(Sadhguru Jaggi Vasudev ) చెప్పొచ్చు. ఆయనకు ఏ ఆధ్యాత్మిక గురువుకూ లేనంతగా సినిమా రంగంలో అభిమానులు ఉన్నారు, అలాగే సినీ రంగంతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఆయన శివరాత్రి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో తారలు హాజరై నృత్యాలు చేయడం చూస్తుంటాం. అలాగే తరచుగా సినిమా నటీనటులు, ఇతర ప్రముఖులు ఆయనతో సంభాషణలు జరుపుతూ ఉండడం ఆ విశేషాలు మీడియాలో బాగా హల్ చల్ చేయడం తెలిసిందే. అదే క్రమంలో ఆయన ఇటీవల ప్రతిష్టాత్మక చిత్రం ’రామాయణ’(Ramayana) నిర్మాత నమిత్ మల్హోత్రాతో జరిగిన సంభాషణలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రాముని పాత్రను రణబీర్ కపూర్ పోషించడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. రణబీర్ గతంలో పోషించిన పాత్రలతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన వార్తల గురించి సైతం ప్రస్తావిస్తూ పెద్ద యెత్తున ట్రోల్ చేస్తున్నారు.
దీనిపై కూడా ఈ సంభాషణలో ఇద్దరూ చర్చించారు. దీని గురించి సద్గురు మాట్లాడుతూ ‘రామ్ పాత్ర కు రణబీర్ సరికాదని చెప్పడం న్యాయమైన తీర్పు కాదు అతను ఏదో ఒక విధంగా గతంలో నటించాడనేది అప్రస్తుతం.. రేపు, మరొక సినిమాలో, అతను రావణుడిలా నటించవచ్చు. అతను ఒక ప్రొఫెషనల్ నటుడు. అంతవరకు చూడాలి. అయితే ఒకటి సినిమా అనేది నటులు లేదా దర్శకుల వల్ల కాదు, ప్రజల వల్ల నడుస్తుంది. కాబట్టి, వారి అంచనాలను కూడా పూర్తిగా తోసిపుచ్చలేం’’ అంటూ వ్యాఖ్యానించారు.
కేజీఎఫ్ స్టార్ యష్(Yash)ను రావణుడిగా ఎంపిక చేయడం పట్ల సద్గురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యష్ నాకు బాగా తెలుసు. అతను ఈ సినిమా లో రావణుడు ఎలా అయ్యాడో నాకు తెలియదు. విలన్ అంటే అతనికి చట్టి ముక్కు వంటివి ఉంటాయి. అయితే యష్ ఒక అందమైన వ్యక్తి కదా అంటూ ఆ పాత్రకు యష్ ఎంపిక పట్ల సద్గురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై సినిమా నిర్మాత నమిత్ తన వైఖరిని సమర్థించుకుంటూ అవును మీరన్నది నిజమే. అతను చాలా అందంగా ఉంటాడు. అంతేకాదు దేశంలో చాలా ప్రతిభావంతుడైన స్టార్ కూడా ‘మేం ఆ పాత్ర ఒక సూపర్ స్టార్ స్థాయి వ్యక్తి పోషించాలని అనుకున్నాం. అంతేకాక అతను కూడా ఆ పాత్ర పోషణను చాలా ఇష్టపడ్డాడు.’’ అంటూ యష్ ఎంపిక గురించి చెప్పాడు. అయితే, సాధారణంగా విలన్లు ఒక ప్రత్యేక రూపంతో ముఖ్యంగా చదునైన ముక్కును కలిగి ఉంటారే తప్ప పదునైన ముక్కు తో ఉండరని సద్గురు అంటూ అది మీరు గమనించారా?‘ అని అంటే... ‘ఇకపై గమనిస్తాను’ అంటూ నమిత్ చమత్కరించారు.
ఇదే చర్చలో ఒక సందర్భంలో తెలుగు దిగ్గజ కధానాయకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావును కూడా సద్గురు ప్రస్తావించడం విశేషం. ఎన్నో సినిమాల్లో ఎన్టీయార్ కృష్ణుడిగా కనిపించి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, అదే ఆయనను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించి ఎన్నికల్లో గెలిచేందుకు కూడా దోహదం చేసిందంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమా, సోషల్ మీడియాలో...ఈ చర్చ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తింది. భక్తి చిత్రాలకు ఎంపిక చేసేటప్పుడు చిత్రనిర్మాతలు ఆధ్యాత్మిక నాయకులను సంప్రదించాలా? దీనిపై తెలుగు దర్శకుడు డాలీ ఓ మీడియాతో మాట్లాడుతూ ‘సద్గురు గొప్ప వ్యక్తి, ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించే ధైర్యం చేయను. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు కలిగి ఉంటారు. కానీ పాత్రల ఎంపిక విషయంలో చివరికి, నిర్మాత దర్శకుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. నాకు తెలిసి రణ్‌బీర్‌ను రామ్‌గా, యష్‌ను రావణ్‌గా నటింపజేయడం ఉత్తర దక్షిణ భారత ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకునే ఒక తెలివైన ప్రయత్నం. రణ్‌బీర్ అద్భుతంగా నటించగలడు..అలాగే యష్ కూడా మెరిపిస్తాడు. ఇక ట్రోల్స్ అంటారా? విశాల థృక్పధం లేని ట్రోల్‌లను విస్మరించడం ఉత్తమం‘ అంటూ స్పష్టం చేశారు.


