– వివేక్ ఓబెరాయ్
హిందీ ‘రామాయణ’ చిత్రంలో తాను నటిస్తున్న విషయాన్ని అధికారికంగా తెలిపారు వివేక్ ఓబెరాయ్. రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో రెండు భాగాలుగా ‘రామాయణ’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో వివేక్ ఓబెరాయ్ కూడా నటిస్తున్నారు.
ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంతో నిర్మాత నమిత్ మల్హోత్రా భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకు వెళ్తున్నారు. ఇది నచ్చి, ఈ సినిమా చేయాలనుకున్నాను. అలాగే ఈ సినిమాకు సంబంధించిన నా పారితోషికం మొత్తాన్ని క్యాన్సర్ బాధిత పిల్లల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేశాను.
ఇక ‘రామాయణ’ సినిమా కోసం రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. నితీష్, నమిత్, రకుల్‌లతో వర్క్ చేయడం బాగుంది’’ అని చెప్పుకొచ్చారు వివేక్ ఓబెరాయ్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో శూర్పణఖగా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తున్నారని, ఆమె భర్త విద్యుజ్జీహ్యుడుగా వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నారని సమాచారం. ‘రామాయణ’ తొలి భాగాన్ని 2026 దీపావళికి, ‘రామాయణ: పార్టు 2’ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.


