ఫోన్ కాల్స్ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను అరికట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు(NBFCs), మ్యూచువల్ ఫండ్‌లతో సహా వివిధ వర్గాల ఆర్థిక సంస్థలు తమ సేవలు, లావాదేవీల కోసం ప్రత్యేకంగా ‘1600’ కాలింగ్ సిరీస్‌ను ఉపయోగించడానికి గడువు ప్రకటించింది. నియంత్రిత ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిజమైన కాల్స్‌ను ప్రజలు సులభంగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని ట్రాయ్ తెలిపింది. తద్వారా మోసాల కేసులను గణనీయంగా తగ్గించడానికి తోడ్పడుతుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
సంస్థల వారీగా గడువులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నియంత్రణలో ఉన్న సంస్థలు ‘1600’ నంబరింగ్ సిరీస్‌ను తప్పనిసరిగా పాటించాలని, అందుకు గడువు తేదీలను ట్రాయ్ స్పష్టం చేసింది.
| సంస్థలు | గడువు తేదీ |
|---|---|
| వాణిజ్య బ్యాంకులు (ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు) | జనవరి 1, 2026 |
| పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్స్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు | ఫిబ్రవరి 1, 2026 |
| మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీలు | ఫిబ్రవరి 15, 2026 |
| సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు, పెన్షన్ ఫండ్ మేనేజర్లు | ఫిబ్రవరి 15, 2026 |
| మిగిలిన ఎన్‌బీఎఫ్‌సీలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు | మార్చి 1, 2026 |
| క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు (QSBలు) | మార్చి 15, 2026 |
గమనిక: బీమా రంగానికి సంబంధించి IRDAIతో గడువుపై ఇంకా చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే ఈ తేదీని ప్రకటిస్తామని ట్రాయ్ తెలిపింది.
టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI) రంగంలోని సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థల కోసం ప్రత్యేకంగా 1600 సిరీస్‌ను కేటాయించింది. ఇది సాధారణ వాణిజ్య కమ్యూనికేషన్‌ల నుంచి అధికారిక సర్వీసులను వేరు చేయడానికి సహాయపడుతుంది. జాయింట్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్ ద్వారా సంప్రదింపులు జరిపిన తర్వాత దశలవారీగా అమలు షెడ్యూల్‌ను జారీ చేసినట్లు ట్రాయ్ తెలిపింది. ఇప్పటికే 485 సంస్థలు 1600 సిరీస్‌ను స్వీకరించాయని పేర్కొంది. ఇతర సెబీ రిజిస్టర్డ్ మధ్యవర్తులు వారి రిజిస్ట్రేషన్ వివరాలను ధ్రువీకరించిన తర్వాత స్వచ్ఛందంగా 1600 సిరీస్‌కు మారవచ్చని ట్రాయ్ తెలిపింది.
ఇదీ చదవండి: ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం


