అంతర్జాతీయ సగటు 50 శాతం కంటే తక్కువ
2011–2లో 26.9% కంటే మెరుగు
నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి
ఉపాధి కల్పనలో సేవల రంగం 30 శాతంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. అయితే అంతర్జాతీయ సగటు 50 శాతం కంటే తక్కువేనని, నిర్మాణాత్మక పరివర్తన నిదానంగా కొనసాగుతుండడం ఇందుకు కారణమని పేర్కొంది. నిర్మాణాత్మక సంస్కరణలు, సామాజిక భద్రతను వేగవంతం చేయడం, అసంఘటిత రంగ కార్మికుల నమోదును డిజిటైజ్ చేయడం, సంరక్షణ చర్యల ద్వారా సేవల రంగంలో ఉపాధి కల్పనను మరింత పెంచొచ్చని సూచించింది.
2011–12 నాటికి ఉపాధి కల్పనలో సేవల రంగం వాటా 26.9 శాతం ఉంటే, 2023–24 నాటికి 29.7 శాతానికి పెరిగినట్టు నీతి ఆయోగ్ తెలిపింది. ముఖ్యంగా గడిచిన ఆరేళ్లలో ఈ రంగంలో 4 కోట్ల ఉపాధి అవకాశాలు ఏర్పడినట్టు తాజా నివేదికలో పేర్కొంది. దేశ ఉపాధి కల్పన వృద్ధికి సేవల రంగం కీలకంగా నిలుస్తున్నట్టు తెలిపింది. ముఖ్యంగా దేశ ఉత్పాదకతలో సేవలు సగం వాటా పోషిస్తుంటే, ఉపాధి కల్పన పరంగా మూడింట ఒక వంతులోపే ఉండడాన్ని నీతి ఆయోగ్ ప్రస్తావించింది. అది కూడా ఎక్కువ మంది అసంఘటిత రంగంలో, తక్కువ వేతనాలకు పనిచేస్తున్నట్టు తెలిపింది. వృద్ధికి, ఉపాధి కల్పనకు మధ్య అంతరం దేశ సేవల ఆధారత అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నట్టు పేర్కొంది.
పట్టణాల్లోనే అధికం..
సేవల రంగంలో ఉపాధి పరంగానూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య నెలకొన్న అంతరాన్ని నీతి ఆయోగ్ నివేదిక ఎత్తి చూపింది. పట్టణాల్లో 60 శాతం మంది ఉపాధి పొందుతుంటే, పల్లెల్లో ఇది 20 శాతంగా ఉన్నట్టు తెలిపింది. స్త్రీ–పురుషుల పరంగానూ అంతరం నెలకొందని.. గ్రామీణ మహిళలు 10.5 శాతం మంది సేవల రంగంలో పనిచేస్తుంటే, పట్టణాల్లో 60 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. సేవల రంగంలో ఉద్యోగాల నాణ్యతకు, విద్యార్హతలకు మధ్య అంతరం అధికంగా ఉంటోందని.. ఈ రంగం అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాల కల్పన అవసరమని సూచించింది. పెద్ద రాష్ట్రాల్లో రిటైల్ షాపులు, రవాణా సేవలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయినప్పటికీ ఉత్పాదకత తక్కువగా ఉంటోంది. ఐటీ, ఫైనాన్స్, నిపుణుల సేవలకు దక్షిణాది, పశ్చిమాది రాష్ట్రాలు కేంద్రంగా ఉంటున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అధిక ఉత్పాదకతతో పటిష్టమైన సేవల కేంద్రాలను ఏర్పాటు చేసుకోగలిగినట్టు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. బీహార్, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాలు తక్కువ విలువ కలిగిన సంప్రదాయ సేవల విభాగాలపై ఆధారపడినట్టు పేర్కొంది.
వీటిపై దృష్టి పెట్టాలి..
సేవలు అన్నింటినీ సంఘటితం చేయడం, తాత్కాలిక, స్వయం ఉపాధిలోని వారికి సామాజిక భద్రత కల్పించడం, ఎంపిక చేసిన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం, మహిళలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల విస్తృతికి డిజిటల్ సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను నీతి ఆయోగ్ నివేదిక సూచించింది.
ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను! తులం ఎంతంటే..


