నర్వ మండలం యాంకి శివారులో అలుగు పారుతున్న ఊర చెరువు
‘వాటర్ బడ్జెటింగ్’లో తెలంగాణ ఆస్పిరేషనల్ బ్లాక్ అద్భుత ఫలితాలు
తక్కువ వర్షపాతం ఉన్నా.. 33% మిగులు జలాలతో రికార్డు
బయటి ప్రాంతాల నుంచి వచ్చే వరదనీటిని ఒడిసిపట్టడంలో సక్సెస్
ఇంకా బోరు బావులపైనే 70% సాగు
చెరువు నీటి వినియోగం పెరగాలని నీతి ఆయోగ్ సూచన
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర నీటిఎద్దడితో కరువు ప్రాంతంగా పేరున్న నారాయణపేట జిల్లాలో ఇప్పుడు జలసిరులు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న అనేక ప్రాంతాలకు మన తెలంగాణలోని ‘నర్వ’బ్లాక్ దిక్సూచిగా నిలిచింది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘వాటర్ బడ్జెటింగ్ ఇన్ ఆస్పిరేషనల్ బ్లాక్స్’నివేదికలో నర్వ బ్లాక్ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించింది. దేశంలోని ఇతర ఆస్పిరేషనల్ బ్లాక్‌లు నీటిలోటుతో సతమతమవుతుంటే...నర్వ మాత్రం 33 శాతం మిగులు జలాలతో నీటి భద్రతలో తమకు సాటిలేరని నిరూపించుకుంది.
తక్కువ వాన.. అయినా నిండు కుండలా
నర్వ బ్లాక్‌లో సగటున నమోదయ్యేది కేవలం 524 మిల్లీమీటర్ల వర్షపాతమే. సాధారణంగా ఇంత తక్కువ వర్షపాతం ఉంటే.. ఆ ప్రాంతం నీటిఎద్దడిని ఎదుర్కోవాలి. కానీ, ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, నీటి నిల్వ సామర్థ్యం అద్భుతాలను సృష్టిస్తున్నాయి. నర్వలో కురిసే వర్షం ద్వారా వచ్చే నీరు తక్కువే అయినా, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని ఒడిసిపట్టడంలో ఈ బ్లాక్ విజయం సాధించింది. నీతిఆయోగ్ నివేదిక ప్రకారం.. నర్వలోని చెరువులు, కుంటలు, ఇతర జల వనరుల్లో ఏకంగా 23,371 హెక్టార్ మీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది.
సాగు నీరే సింహభాగం
నర్వ బ్లాక్‌లో నీటి వినియోగం ప్రధానంగా వ్యవసాయం చుట్టూనే తిరుగుతోంది. బ్లాక్‌లో అందుబాటులో ఉన్న నీటిలో 91 శాతం కేవలం సాగుకే వినియోగిస్తున్నారు. ఇక్కడ గొర్రెల పెంపకం (సుమారు 1.08 లక్షలు) కూడా ఎక్కువే అయినా, వాటి నీటి అవసరాలు తక్కువగానే ఉన్నాయి. మానవ అవసరాలకు 6 శాతం నీటిని వాడుతున్నారు.
భూగర్భ జలాలపైనే భారం.. మారాల్సిన తీరు
నీటి నిల్వల్లో నర్వ మిగులు సాధించినా, క్షేత్రస్థాయిలో రైతులు ఇంకా భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని నీతి ఆయోగ్ వెల్లడించింది. బ్లాక్‌లో 70 శాతం నీటి సరఫరా భూగర్భ జలాల నుంచే జరుగుతోంది. ఉపరితల నీటి వాటా కేవలం 30 శాతమే ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ భూగర్భ జలాలు ‘సేఫ్’జోన్‌లోనే ఉన్నా, భవిష్యత్‌లో బోరుబావుల వినియోగం తగ్గించి, చెరువు నీటిని సాగుకు మళ్లించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నర్వ విజయ రహస్యాలివే
నీటి లభ్యత: 2,163 హెక్టార్ మీటర్లు.
నీటి అవసరం: 1,627 హెక్టార్ మీటర్లు.
మిగులు జలాలు: +536 హెక్టార్ మీటర్లు (33% సర్ ప్లస్)
సేఫ్‌జోన్: భూగర్భ జలాల వినియోగం 40.78 శాతంతో ‘సురక్షిత’వర్గంలో ఉంది.
మిషన్ భగీరథ సక్సెస్: ‘జల్ జీవన్ మిషన్’కింద ఈ బ్లాక్‌లో 100 శాతం ఇళ్లకు కుళాయిల ద్వారా నీరు అందుతోంది.
⇒ నర్వలో ఉపరితల నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నందున, రైతులు బోరుబావులపై ఆధారపడటం తగ్గించుకోవాలని, తద్వా రా భూగర్భ జలాలను భవిష్యత్ తరాలకు భద్రపరచవచ్చని నీతి ఆయోగ్ తమ నివేదికలో సూచించింది.


